పహల్గామ్లో జరిగిన ఉగ్రదాడి దృష్ట్యా భారత్ కఠిన నిర్ణయాలు తీసుకుంటోంది. అందులో భాగంగా, పాకిస్థాన్‌తో ఉన్న సింధూ జలాల ఒప్పందాన్ని అమలు చేయకూడదనే నిర్ణయాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది. ఈ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ తొలిసారిగా స్పందించారు. భారత్‌కు చెందిన జలాలు ఇకపై దేశ ప్రయోజనాలకే వినియోగించబడతాయని మోదీ స్పష్టం చేశారు.
“మన జలాలు – మన హక్కు. ఇప్పటి వరకు ఆ జలాలు వెలుపలికి వెళ్లాయి. ఇకపై అలా జరగదు. వాటిని మన అవసరాలకే వినియోగిస్తాం,” అంటూ ప్రధాని మోదీ తేల్చిచెప్పారు. దేశ భద్రత, ప్రజల అవసరాలు అత్యంత ప్రాధాన్యత కాబట్టి, వాటిని దృష్టిలో ఉంచుకునే ఈ నిర్ణయం తీసుకున్నామని ఆయన అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం చినాబ్ నదిపై ఉన్న బాగ్లిహార్ ఆనకట్ట నుండి పాకిస్థాన్‌కు పంపే నీటి ప్రవాహాన్ని నిలిపివేయడానికి కేంద్రం చర్యలు చేపట్టింది. అదే సమయంలో జీలం నదిపై ఉన్న కిషన్ గంగా ప్రాజెక్టు నుండి కూడా ప్రవాహాలను తగ్గించేందుకు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చర్యలు పాకిస్థాన్‌కు నీటి ఆధారిత ఒత్తిడిని పెంచే అవకాశముంది.
ఇది కేవలం ఒక నీటి ఒప్పందం కోణంలో కాకుండా, దేశ భద్రత, ప్రాదేశిక సమగ్రత కోణంలో తీసుకున్న వ్యూహాత్మక చర్యగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మోదీ చేసిన ప్రకటనతో పాక్‌పై నీటి ఆధారిత ఒత్తిడిని పెంచుతూ, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా భారత్ తన శక్తివంతమైన సంకేతాన్ని పంపించిందని విశ్లేషణలు చెబుతున్నాయి.









