భారత స్టార్ అథ్లెట్, ఒలింపిక్ విజేత నీరజ్ చోప్రా మరోసారి తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకట్టుకున్నాడు. శుక్రవారం దోహా వేదికగా జరిగిన డైమండ్ లీగ్ 2025 పోటీల్లో నీరజ్ చోప్రా 90.23 మీటర్ల జావెలిన్ త్రోతో తన కెరీర్‌లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచాడు. గతంలో తన పేరిటే ఉన్న 89.94మీటర్ల జాతీయ రికార్డును తుడిచిపెట్టిన నీరజ్ ఎట్టకేలకు 90 మీటర్ల క్లబ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.
పోటీ మొదటి ప్రయత్నంలో 88.44 మీటర్ల దూరం విసిరిన ఆయన, రెండోసారి ఫౌల్ అయ్యాడు. కానీ మూడో ప్రయత్నంలో అద్భుతంగా 90.23 మీటర్ల దూరం విసిరి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఇది జావెలిన్ విస్మృతిలో భారత క్రీడాకారుడిగా ఒక మైలురాయిగా నిలిచింది. అయితే, నాలుగో త్రోలో కేవలం 80.56మీ, ఐదో ప్రయత్నంలో మళ్లీ ఫౌల్ అయ్యాడు. ఆఖరి ప్రయత్నంలో 88.20మీటర్లకే పరిమితమయ్యాడు.
అయితే, ఈ పోటీలో చివరి అంకంలో ఊహించని విధంగా జర్మనీకి చెందిన జులియన్ వెబర్ 91.06 మీటర్ల భారీ త్రోతో టాప్‌లోకి దూసుకొచ్చాడు. ఈ త్రో అతని కెరీర్‌లోనే అత్యుత్తమంగా నిలిచింది. దీంతో నీరజ్‌ను వెనక్కు నెట్టి విజేతగా నిలిచాడు. కాగా, గ్రెనాడాకు చెందిన అథ్లెట్ అండర్సన్ పీటర్స్ 85.64 మీటర్లతో మూడో స్థానాన్ని దక్కించుకున్నాడు.
నీరజ్ చోప్రా ఇప్పటివరకు చేసిన అత్యుత్తమ టాప్-5 త్రోలు లలో తాజా దోహా డైమండ్ లీగ్‌లో నమోదు చేసిన 90.23 మీటర్ల త్రో మొదటిస్థానంలో ఉంది. తర్వాత 89.94మీ (2022), 89.49మీ (2024 లౌసాన్), 89.45మీ (2024 ఒలింపిక్స్ ఫైనల్), 89.34మీ (2024 ఒలింపిక్స్ క్వాలిఫైయర్)లుగా ఉన్నాయి. ఈ ప్రదర్శనతో నీరజ్ మరోసారి భారత క్రీడాభిమానులకు గర్వకారణంగా నిలిచాడు.









