అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని విశాఖపట్నంలో జరగనున్న ‘యోగాంధ్ర’ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ శుక్రవారం నగరానికి చేరుకున్నారు. ప్రధాని రాకతో విశాఖ నగరం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది. ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి నారా లోకేశ్ ప్రధానిని విమానాశ్రయంలో స్వాగతించారు.
సామాజిక మాధ్యమాల్లో మంత్రి లోకేశ్ ఈ విషయాన్ని వెల్లడించారు. “యోగాంధ్రలో పాల్గొనడానికి విశాఖ వచ్చిన గౌరవ ప్రధాని మోదీ గారికి స్వాగతం పలికాను. మోదీ అంటే మోటివేషన్, మోదీ అంటే డెడికేషన్” అంటూ ఆయన మోదీ నాయకత్వాన్ని కొనియాడారు. ప్రధానిని కలవడం గర్వంగా ఉందని పేర్కొన్నారు.
ఏపీ ప్రభుత్వం యోగా కార్యక్రమాన్ని ప్రపంచ స్థాయిలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శనివారం ఉదయం 5.30 గంటలకు ప్రారంభం కానున్న ఈ కార్యక్రమంలో 5 లక్షల మంది పాల్గొననున్నారని అంచనా. యోగా నిర్వహణలో గిన్నిస్ రికార్డు సాధించాలనే లక్ష్యంతో అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, విద్యార్థులు సమిష్టిగా కృషి చేస్తున్నారు.
ఈ యోగాంధ్ర ఉత్సవం విజయవంతం కావడానికి సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, ఇతర మంత్రులు పటిష్ఠమైన పర్యవేక్షణ నిర్వహిస్తున్నారు. కార్యక్రమం అనంతరం మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. విశాఖ నగరాన్ని ప్రపంచ యోగా పటముపై నిలబెట్టే దిశగా ఈ మహాఘట్టానికి మోదీ రాక విశిష్టతను చేకూర్చిందని అధికారులు తెలిపారు.









