తమిళనాడులో రుణాల పేరుతో జరుగుతున్న వేధింపులపై రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా స్పందించింది. రుణ సంస్థలు తీసుకుంటున్న అనైతిక రికవరీ చర్యలు, ప్రజల ఆత్మహత్యలకు దారితీస్తున్న నేపథ్యంలో ఈ చర్యలు తీసుకున్నారు. ఇటీవల తమిళనాడు శాసనసభలో ఆమోదించిన “తమిళనాడు రుణ సంస్థల (బలవంతపు చర్యల నివారణ) బిల్లు, 2025” కు గవర్నర్ ఆర్.ఎన్. రవి ఆమోదం తెలిపారు. ఇది రుణగ్రహీతల హక్కుల పరిరక్షణలో కీలక మైలురాయిగా భావిస్తున్నారు.
ఈ చట్టం ప్రకారం ఇకపై రుణ సంస్థలు లేదా వాటి ఏజెంట్లు రుణగ్రహీతలు లేదా వారి కుటుంబ సభ్యులపై ఒత్తిడి తీసుకురావడానికి ఎలాంటి బలవంతపు చర్యలకు పాల్పడలేరు. అలాంటి చర్యలు తీసుకుంటే వారికి గరిష్టంగా ఐదేళ్ల వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉంది. ఇది దేశంలో రుణ వేధింపులపై రూపొందించిన తొలితరపు చట్టాల్లో ఒకటిగా గుర్తింపు పొందే అవకాశం ఉంది.
అంతేకాకుండా, రుణ సంస్థల వేధింపుల కారణంగా ఎవైనా రుణగ్రహీత లేదా కుటుంబ సభ్యులు ఆత్మహత్యకు పాల్పడితే, భారతీయ న్యాయ సంహిత 2023లోని సెక్షన్ 108 ప్రకారం ఆత్మహత్యకు ప్రేరేపించినట్లు కేసు నమోదు చేస్తారు. దీని ద్వారా బాధ్యతారాహిత్యంగా వ్యవహరిస్తున్న రుణ సంస్థలపై నేరపూరిత చర్యలు తీసుకునే అవకాశం ఏర్పడింది.
ఈ బిల్లును శాసనసభలో ప్రవేశపెట్టిన సందర్భంగా డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, బలహీన వర్గాలు అప్పు తీసుకున్న తర్వాత ఎదుర్కొంటున్న వాస్తవ పరిస్థితులను వెల్లడించారు. అనైతిక రికవరీ చర్యలు కుటుంబాలను విచ్ఛిన్నం చేస్తున్నాయని, సామాజిక శాంతికి భంగం కలుగుతోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా ఆర్థిక దోపిడీకి అడ్డుకట్ట వేయడమే తమ ప్రభుత్వ ధ్యేయమని ఆయన స్పష్టం చేశారు.









