తెలుగు మహిళ రేవతి మన్నెపల్లి అంతర్జాతీయ స్థాయిలో అరుదైన గౌరవానికి చేరువయ్యారు. ఐక్యరాజ్యసమితికి చెందిన ఇంటర్నేషనల్ టెలికమ్యూనికేషన్ యూనియన్ (ఐటీయూ) రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్ పదవికి భారత అధికారిక అభ్యర్థిగా కేంద్ర ప్రభుత్వం ఆమెను నామినేట్ చేసింది. ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లా సూళ్లూరుపేటకు చెందిన రేవతి, ఈ పదవికి ఎన్నికైతే బ్యూరోకు నాయకత్వం వహించిన తొలి మహిళగా చరిత్ర సృష్టించనున్నారు. ఈ విషయం తెలిసి ఆమె స్వగ్రామంలో హర్షాతిరేకం వ్యక్తమవుతోంది.
కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. “2027–30 కాలానికి ఐటీయూ రేడియో కమ్యూనికేషన్ బ్యూరో డైరెక్టర్ పదవికి భారత అభ్యర్థిగా రేవతికి హృదయపూర్వక శుభాకాంక్షలు. ఆమె విజయం సాధించి భారత విజన్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను,” అని మంత్రి ట్వీట్ చేశారు. ఈ కీలక పదవికి సంబంధించిన ఎన్నికలు 2026లో జరగనున్నాయి.
రేవతి మన్నెపల్లి చిన్నప్పటి నుంచే ప్రతిభ కనబరుస్తూ, తమ గ్రామంలో తొలి ఇంజినీర్‌గా నిలిచారు. హైదరాబాద్ జేఎన్టీయూలో బీటెక్ పూర్తిచేసి, షార్‌లో ఇంజినీర్‌గా పని ప్రారంభించారు. ఏఎస్ఎల్వీ, పీఎస్ఎల్వీ వంటి భారతీయ అంతరిక్ష ప్రయోగాల్లో కీలక పాత్ర పోషించారు. ఆ తర్వాత బార్క్‌లో శాస్త్రవేత్తగా కొనసాగి, ఆడ్వాన్స్డ్ టెక్నాలజీలలో అనుభవం సంపాదించారు. ఈ ప్రయాణం ఆమెను అంతర్జాతీయ స్థాయికి చేర్చింది.
గత కొన్ని ఏళ్లుగా రేవతి టెలికం రంగంలో కీలక బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ప్రస్తుతం జెనీవాలో ఇంటర్నేషనల్ రేడియో రెగ్యులేషన్ బోర్డులో సభ్యురాలిగా ఉన్న ఆమె, డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్‌లో జాయింట్ వైర్లెస్ అడ్వైజర్‌గా కొనసాగుతున్నారు. దక్షిణాసియా శాటిలైట్ ఆర్బిటల్ హక్కుల సాధనలో ఆమె పాత్ర ముఖ్యమైనది. 6జీ, స్పెక్ట్రమ్ పాలసీల రూపకల్పనలోనూ ఆమె సలహాలు కేంద్రానికి అమూల్యంగా నిలుస్తున్నాయి.









