ఆపరేషన్ సిందూర్‌పై ఉపరాష్ట్రపతి ప్రశంసలు

VP Dhankhar praised Indian Army's 'Operation Sindoor' post Pahalgam attack, saying it showed India’s strength and resolve against terrorism.

పహల్గామ్ వద్ద జరిగిన ఉగ్రదాడి అనంతరం భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్ సిందూర్’పై ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్‌ఖడ్ ప్రశంసలు కురిపించారు. గోవా రాజ్‌భవన్‌లో వామన్ వృక్షకళా ఉద్యానవనంలో చరకుడు, సుశ్రుతుడుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన అనంతరం ఆయన మాట్లాడారు. ఈ ఆపరేషన్‌ ఉగ్రవాదంపై భారత ప్రభుత్వం ఎంత కఠినంగా స్పందించిందో స్పష్టమవుతోంది. ఉగ్రవాదానికి శిక్ష తప్పదని, ఎక్కడ నక్కినా ఉగ్ర మూకలను ఏరివేస్తామని ప్రధాని మోదీ బలమైన సందేశాన్ని ప్రపంచానికి పంపారని ఉపరాష్ట్రపతి అన్నారు.

భారతదేశం ప్రస్తుతం ఎంతో భిన్నంగా మారిందని, పూర్తిగా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతోందని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. దేశ భద్రత విషయంలో ఏమాత్రం సహనం చూపించదని స్పష్టంగా చెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా భారత సైన్యం తన ప్రావీణ్యాన్ని మరోసారి నిరూపించుకుందని పేర్కొన్నారు. భారత సాయుధ బలగాలు ఎలాంటి పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొంటున్నాయని, శత్రువుల స్థావరాలను అత్యంత కచ్చితంగా గుర్తించి విజయవంతంగా లక్ష్యాలను ఛేదించారని ఆయన కొనియాడారు.

ఈ సాహసోపేత ఆపరేషన్‌ ప్రపంచ దేశాల్లో భారత సైనిక శక్తిపై ఉన్న విశ్వాసాన్ని మరింత పెంచిందని ధన్‌ఖడ్ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని జాడలు లేకుండా అణిచివేయాలన్న ధృఢ సంకల్పంతో భారత సైన్యం ముందుకు సాగుతోందని తెలిపారు. శత్రువులపై జరిపిన దాడుల్లో భారత బలగాలు చూపిన వ్యూహ పటిమ, సాంకేతిక నైపుణ్యం ప్రశంసనీయమని అభిప్రాయపడ్డారు.

దేశం గర్వపడేలా చేసిన మన సాయుధ బలగాలకు తాను సెల్యూట్ చేస్తున్నానని ఉపరాష్ట్రపతి స్పష్టం చేశారు. ‘ఆపరేషన్ సిందూర్’ సమయంలో భారత సైనిక దళాలు చూపిన ధైర్య సాహసాలు ప్రజలకు గర్వకారణంగా నిలిచాయని అన్నారు. ఉగ్రవాదంపై భారత్‌ చూపిన స్పష్టత, శక్తి ప్రదర్శనపై ప్రపంచ దేశాలు గమనిస్తున్నాయని తెలిపారు. భారతం ఇకపై ఉగ్రవాదాన్ని ఏ మాత్రం సహించదన్న సందేశాన్ని ఈ ఆపరేషన్ ఇచ్చిందని పేర్కొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share