అవినీతి శక్తులపై విజిల్ ఊదండి – హీరో విజయ్ పిలుపు

తమిళనాడులో ఉన్న అవినీతి శక్తులను విజిల్ ఊది రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని తమిళగ వెట్రి కళగం (TVK) పార్టీ అధ్యక్షుడు, హీరో విజయ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. టీవీకే పార్టీ స్థాపించి మూడేళ్లు పూర్తైన సందర్భంగా పనైయూర్‌లోని పార్టీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన విజయ్, తమ పార్టీని ఒక “స్వచ్ఛమైన శక్తి”గా అభివర్ణించారు.

రాష్ట్రాన్ని పాలిస్తున్న చెడు, అవినీతి శక్తులను ఓడించే సత్తా కేవలం టీవీకే పార్టీకి మాత్రమే ఉందని విజయ్ ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం కేటాయించిన ‘విజిల్’ గుర్తును ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని, కార్యకర్తలు ఊదే విజిల్ శబ్దానికి అవినీతి శక్తులు భయపడి పారిపోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ విజిల్ ప్రజల గొంతుగా మారాలని వ్యాఖ్యానించారు.

ఈ సందర్భంగా అధికార డీఎంకే ప్రభుత్వాన్ని, ముఖ్యంగా ముఖ్యమంత్రి ఎం.కె. స్టాలిన్‌ను లక్ష్యంగా చేసుకుని విజయ్ తీవ్ర విమర్శలు చేశారు. రాష్ట్రంలో డీఎంకే చేస్తున్న తప్పులను ఎత్తిచూపే ధైర్యం గతంలో ఎవరికీ లేదని, ఇప్పుడు ఆ బాధ్యతను తామే తీసుకున్నామని స్పష్టం చేశారు. స్టాలిన్ నిద్రలో కూడా టీవీకే విజిల్ భయం వెంటాడుతోందని ఎద్దేవా చేశారు.

ఎవరైనా స్టాలిన్‌ను నిద్రలో లేపి ఏ గుర్తుకు ఓటు వేస్తారని అడిగితే ‘విజిల్’ గుర్తుకే అని చెబుతారని విజయ్ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. టీవీకే పార్టీ నగరాలకే పరిమితం కాలేదని, పల్లెపల్లెనా విజిల్ వినిపిస్తోందని తెలిపారు. 2026 అసెంబ్లీ ఎన్నికల్లో టీవీకే నిర్ణయాత్మక శక్తిగా మారుతుందని ఈ సందర్భంగా ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share