యూట్యూబ్‌లో మర్మకళ నేర్చుకొని హత్య చేసిన యువకుడు!

ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనంలో కూరుకుపోయిన ఓ వ్యక్తి యూట్యూబ్ వీడియోలు చూసి, ఏకంగా మర్మ కళ నేర్చుకుని హత్యకు పాల్పడిన ఘటన శ్రీ సత్యసాయి జిల్లా మడకశిరలో కలకలం రేపింది. భారతీయుడు సినిమాలో కమల్ హాసన్ మర్మ కళతో అవినీతిపరులను అంతమొందించడం తెలిసిందే. మడకశిరకు చెందిన నరసింహమూర్తి అనే వ్యక్తి కూడా మర్మ కళలో ఆరితేరి, నిండు  ప్రాణాన్ని తీశాడు. 

రమాదేవి అనే వివాహితను హత్య చేసి, ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకున్న నరసింహమూర్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.
పావగడకు చెందిన రమాదేవి, మడకశిరకు చెందిన నరసింహమూర్తి మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది. ఆన్‌లైన్ రమ్మీ, బెట్టింగ్‌లతో అప్పుల పాలైన నరసింహమూర్తి, రమాదేవిని హత్య చేసి డబ్బు సంపాదించాలని పథకం వేశాడు. 

ఇందుకోసం యూట్యూబ్‌లో ‘ఎలా హత్య చేయాలి?’ అని వెతికి వీడియోలు చూశాడు. ఆ వీడియోలలో చూపిన పద్ధతులను అనుసరించి, రమాదేవిని కేవలం చేతి వేళ్లతో గొంతు నులిమాడు. ఆమె రక్తం కక్కుకుని చనిపోయేలా చేశాడు. అనంతరం ఆమె ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలను దోచుకుని, మృతదేహాన్ని అటవీ ప్రాంతంలో పాతిపెట్టాడు.

కొన్ని రోజుల తర్వాత గొర్రెల కాపరులు అస్థిపంజరాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మృతురాలు రమాదేవిగా గుర్తించారు. కాల్ డేటా ఆధారంగా నరసింహమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించగా అసలు విషయం బయటపడింది.

“ఆన్‌లైన్ బెట్టింగ్‌లో డబ్బు పోగొట్టుకున్నాను. అప్పులు తీర్చడానికి రమాదేవిని చంపి, ఆమె బంగారం తీసుకోవాలని అనుకున్నాను. అందుకే యూట్యూబ్‌లో హత్య ఎలా చేయాలి అని వీడియోలు చూశాను” అని నరసింహమూర్తి పోలీసులకు చెప్పాడు.

ఈ కేసులో యూట్యూబ్ వీడియోలు చూడటం నేర్చుకుని హత్య చేయడం అనేది కొత్త కోణాన్ని వెలుగులోకి తెచ్చింది. పోలీసులు ఈ ఘటనపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఆన్‌లైన్ బెట్టింగ్ వ్యసనం, యూట్యూబ్ వంటి వేదికల ద్వారా నేరాలు ఎలా జరుగుతున్నాయో ఈ కేసు మరోసారి రుజువు చేసింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share