ప్రముఖ క్రికెటర్ యజువేంద్ర చాహల్తో విడాకుల అనంతరం సోషల్ మీడియా వేదికగా నిరంతరంగా ఎదురవుతున్న ట్రోలింగ్, విమర్శలకు ధనశ్రీ వర్మ తొలిసారి స్పందించింది. 2020లో వివాహం చేసుకున్న ఈ జంట 2025 మార్చి 20న విడిపోయింది. అనంతరం చాహల్ మరోకరితో డేటింగ్ చేస్తున్నాడన్న వార్తల మధ్య, ధనశ్రీ మాత్రం తన వ్యక్తిగత దైనందిన జీవనంపై, పాజిటివ్ దృక్పథంతో స్పందించింది.
ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ధనశ్రీ మాట్లాడుతూ, “ట్రోల్స్ నన్ను అస్సలు బాధించవు. నేను మానసికంగా ఎంతో బలంగా తయారయ్యాను. నా దృష్టి అంతా నా పని మీదే. అదే నా సమాధానం, అదే నా శక్తి” అని స్పష్టం చేసింది. తన పని మీదే పూర్తిగా ఏకాగ్రత పెట్టడం వల్లే ఇతర విషయాలు ఆమెను ప్రభావితం చేయలేదని తెలిపింది.
తనపై వస్తున్న ‘గోల్డ్ డిగ్గర్’ వదంతులపై కూడా ఆమె సమాధానం ఇచ్చింది. “వాటికి స్పందించాలంటే, వాటికే ప్రాధాన్యతనిచ్చినట్లవుతుంది. నాకు సంబంధించిన ప్రచారం నా పని చుట్టూ మాత్రమే ఉండాలని కోరుకుంటున్నా” అని ధనశ్రీ అభిప్రాయపడింది. ప్రజల అభిప్రాయాలను ఎదుర్కొంటూ, తాను నేర్చుకున్న పాఠాలను విలువైన అనుభవాలుగా మలచుకుంటున్నానని చెప్పింది.
తాజాగా, ధనశ్రీ “భూల్ చుక్ మాఫ్” చిత్రంలోని ప్రత్యేక గీతం “టింగ్ లింగ్ సజనా”లో నృత్యం చేసి మరోసారి తెరపైకి వచ్చింది. ఆమె వ్యక్తిగత జీవితం కాకుండా, తన వృత్తి, ఎదుగుదలే ప్రధాన కథనం కావాలని ధనశ్రీ స్పష్టం చేసింది. ప్రతి దశను, ప్రతి విమర్శను ఎదుగుదలకు మెట్లు చేసుకుంటూ ముందుకు సాగుతోందని తెలియజేసింది.









