లార్డ్స్ వేదికగా జరుగుతున్న ఐసీసీ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ (WTC) ఫైనల్ 2025లో ఆస్ట్రేలియా బలమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. రెండో రోజు రెండో సెషన్ ముగిసే సమయానికి ఆసీస్ జట్టు 84 పరుగుల కీలక ఆధిక్యంలో నిలిచింది. టాస్ గెలిచిన దక్షిణాఫ్రికా బౌలింగ్ ఎంచుకోవడం వ్యూహపూరిత నిర్ణయంగా కనిపించినా, ఆస్ట్రేలియా బౌలింగ్ ధాటికి వారు చిత్తయిపోయారు. ప్యాట్ కమిన్స్ నేతృత్వంలోని ఆసీస్ బౌలర్లు, ప్రత్యర్థి బ్యాటింగ్‌ను పూర్తి స్థాయిలో కుదేలు చేశారు.
ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్ 6 వికెట్లతో దక్షిణాఫ్రికా బ్యాటింగ్‌ను చీల్చి చెదరగొట్టాడు. కమిన్స్ 6/28తో అద్భుత ప్రదర్శన చేయగా, మిచెల్ స్టార్క్ 2, హేజిల్‌వుడ్ ఒక వికెట్ తీశారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 138 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇందులో డేవిడ్ బెడింగ్హామ్ 45, కెప్టెన్ టెంబా బావుమా 36 పరుగులతో కొంత సంతృప్తికరంగా ఆడినప్పటికీ మిగతా బ్యాటర్లు పూర్తిగా విఫలమయ్యారు.
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో 212 పరుగులకు ఆలౌట్ అయింది. ఒక దశలో 67 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన ఆస్ట్రేలియా జట్టును స్టీవ్ స్మిత్ (66), బ్యూ వెబ్‌స్టర్ (72) అద్భుతంగా ఆదుకున్నారు. వీరిద్దరి భాగస్వామ్యం వలన ఆసీస్ గౌరవప్రదమైన స్కోరు సాధించింది. దక్షిణాఫ్రికా బౌలర్లలో కగిసో రబాడ 5 వికెట్లు, మార్కో జాన్సెన్ 3 వికెట్లు తీసి ఆకట్టుకున్నారు. అయితే చివరికి ఆసీస్‌కు తొలి ఇన్నింగ్స్‌లో 74 పరుగుల కీలక ఆధిక్యం లభించింది.
రెండో ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా మరింత స్థిరంగా ఆడుతోంది. 3.5 ఓవర్లు ముగిసే సమయానికి వికెట్ నష్టపోకుండా 10 పరుగులు చేసింది. మార్నస్ లబుషేన్ 7 పరుగులు, ఉస్మాన్ ఖవాజా 1 పరుగుతో క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం మొత్తం ఆధిక్యం 84 పరుగులకు చేరింది. మ్యాచ్‌పై ఆసీస్ పట్టు బలంగా ఉన్నా, దక్షిణాఫ్రికా బౌలర్లు తామూ ఏమి తక్కువ కాదని నిరూపించే అవకాశాలు ఉన్నాయి.









