ఎడ్జ్‌బాస్టన్‌లో టీమిండియాతో జరిగిన రెండో టెస్టులో ఇంగ్లండ్‌కు ఎదురైన 336 పరుగుల ఘోర పరాజయం జట్టును గట్టిగానే తాకింది. అయితే ఈ ఎదురుదెబ్బ నుంచి తేరుకున్న ఆ జట్టు జూలై 10న ప్రారంభమయ్యే మూడో టెస్టుకు పక్కా వ్యూహంతో సిద్ధమవుతోంది. ఈ మ్యాచ్ లార్డ్స్‌లో జరగనుండగా, ఇంగ్లండ్ ఇప్పటికే వేగం మరియు బౌన్స్‌కు అనుకూలమైన పిచ్ కావాలని ఎంసీసీ గ్రౌండ్ సిబ్బందిని కోరింది. భారత పేసర్ల ధాటికి గత టెస్టులో చిత్తవిన ఇంగ్లండ్ ఈసారి తమ పేసర్లతో కౌంటర్ ఇవ్వాలని భావిస్తోంది.
ఇంగ్లండ్ బౌలింగ్ విభాగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా, గాయాల నుంచి కోలుకున్న స్టార్ పేసర్ జోఫ్రా ఆర్చర్‌ను మళ్లీ జట్టులోకి తీసుకుంది. 2021 ఫిబ్రవరి తర్వాత ఆయన ఆడబోయే తొలి టెస్టు ఇదే కావడం విశేషం. “ఆర్చర్ ఇప్పుడు ఫిట్‌గా ఉన్నాడు. లార్డ్స్ టెస్టులో అతను పూర్తి స్థాయిలో తన సామర్థ్యాన్ని చూపుతాడని నమ్మకం,” అని ఇంగ్లండ్ కోచ్ బ్రెండన్ మెకల్లమ్ వ్యాఖ్యానించాడు. ఆర్చర్ పునరాగమనంతో ఇంగ్లండ్ పేస్ దళానికి బలం చేకూరనుంది.
అలాగే, గాయం నుంచి కోలుకున్న మరో పేసర్ గస్ అట్కిన్సన్‌ను కూడా జట్టులోకి తీసుకున్నారు. వీరిద్దరి చేరికతో ఇంగ్లండ్ పేస్ దళానికి కొత్త ఉత్సాహం వచ్చింది. కోచ్ మెకల్లమ్ మాట్లాడుతూ, “పిచ్‌లో వేగం, బౌన్స్ ఉండటం మ్యాచ్‌కు మరో మలుపు తిప్పుతుంది. ఇది బ్లాక్‌బస్టర్ టెస్టుగా నిలుస్తుంది,” అని ఆశాభావం వ్యక్తం చేశాడు. ఎడ్జ్‌బాస్టన్‌లో ప్లాట్ పిచ్‌పై టీమిండియా పేసర్లు మెరిసిన తీరును దృష్టిలో పెట్టుకుని ఇంగ్లండ్ ఇప్పుడు అదే ఆయుధాన్ని ఉపయోగించాలన్న వ్యూహంలో ఉంది.
ప్రస్తుతం సిరీస్ 1-1తో సమంగా ఉంది. మూడో టెస్టులో గెలిచి ఆధిక్యం సాధించేందుకు ఇరు జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. భారత బౌలింగ్ అంచనాలకు మించి రాణించగా, బ్యాటింగ్‌లోనూ నిలకడ కనిపిస్తోంది. మరోవైపు, ఇంగ్లండ్ పేసర్లు మళ్లీ దూకుడుగా రావడంతో లార్డ్స్ వేదికగా హోరాహోరీ పోరు జరగనుంది. అభిమానులు ఈ మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్నారు.









