ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఎన్నో విజయాలు అందించిన ఎంఎస్ ధోనీ భవిష్యత్తు గురించి ఆస్ట్రేలియా దిగ్గజం ఆడమ్ గిల్‌క్రిస్ట్ స్పందించాడు. ఈ సీజన్‌లో సీఎస్కే ప్రదర్శన బలహీనంగా ఉండటంతో ధోనీ రిటైర్మెంట్ అవసరమని అభిప్రాయపడ్డాడు. 2025 ఐపీఎల్ సీజన్ తర్వాత ధోనీ ఆట నుంచి తప్పుకోవడం జట్టుకి మంచిదని అన్నారు.
ప్రస్తుతం సీఎస్కే 9 మ్యాచ్‌ల్లో కేవలం 2 విజయాలు మాత్రమే సాధించగా, కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ గాయం కారణంగా టోర్నీకి దూరమయ్యాడు. దీనితో ధోనీ మళ్లీ కెప్టెన్సీ చేపట్టాడు కానీ బ్యాటింగ్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. ఈ సీజన్‌లో ధోనీ 98 బంతుల్లో 140 పరుగులు మాత్రమే చేశాడు. ఈ దృష్ట్యా గిల్‌క్రిస్ట్ స్పందిస్తూ ధోనీకి ఇంకేమీ నిరూపించాల్సిన అవసరం లేదన్నాడు.
“ధోనీ ఇప్పటికే తన కెరీర్‌లో అత్యుత్తమంగా రాణించాడు. అతను చాంపియన్, ఐకాన్. కానీ జట్టు అవసరాల దృష్ట్యా అతను తప్పుకోవడం మంచిదని నా అభిప్రాయం” అంటూ తన భావాలను వెల్లడించాడు. ధోనీ పట్ల తనకున్న గౌరవాన్ని తెలిపిన గిల్‌క్రిస్ట్, సీఎస్కేకి తాజా మార్పులు అవసరమని సూచించాడు.
వచ్చే సీజన్‌కు ముందు సీఎస్కే జట్టులో ప్రక్షాళన అవసరమని గిల్‌క్రిస్ట్ అభిప్రాయపడ్డాడు. ధోనీతో పాటు షేక్ రషీద్, డేవాన్ కాన్వే, దీపక్ హుడా వంటి ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించాలని సూచించాడు. 2025 ఐపీఎల్ ముగిసే నాటికి రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్ జట్లు టాప్ 2లో ఉంటాయని జోస్యం చెప్పాడు.









