భారత క్రికెట్ జట్టు కెప్టెన్ రోహిత్ శర్మ టెస్టు ఫార్మాట్‌కు అనూహ్యంగా గుడ్‌బై చెప్పిన విషయం ఇప్పుడు క్రీడా ప్రపంచంలో హాట్ టాపిక్‌గా మారింది. ఇంగ్లండ్ టూర్‌కు టెస్ట్ కెప్టెన్సీ నుంచి రోహిత్ తప్పించబడతాడన్న వార్తల తరువాత, అతడు స్వయంగా టెస్టులకు వీడ్కోలు ప్రకటించడం కీలక పరిణామంగా మారింది. ఇప్పటికే టీ20లకు గుడ్‌బై చెప్పిన రోహిత్, ఇకపై వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కనిపించనున్నాడు.
ఈ సందర్భంగా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ స్పందిస్తూ రోహిత్ కెప్టెన్సీకి ప్రశంసల జల్లు కురిపించారు. “ఆటగాడిగా, కెప్టెన్‌గా రోహిత్ భారత్‌కి ఎంతో సేవ చేశాడు. అతడి శాంతమైన నేతృత్వం, పట్టు, ఆటతీరు భారత క్రికెట్‌కు గొప్ప ఆదర్శం” అని అన్నారు. టెస్ట్ ఫార్మాట్‌లో రోహిత్‌కు బదులుగా సరైన నాయకుడిని కనుగొనడం అంత తేలిక కాదు అని చెప్పారు.
రోహిత్ శర్మ 2027 వన్డే వరల్డ్ కప్ ఆడతాడా లేదా అనే అంశం చర్చనీయాంశంగా మారిన వేళ, కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు చేశారు. “ప్రతి ఆటగాడు ఎక్కువకాలం ఆడాలని కోరుకుంటాడు. కానీ జట్టు ఎంపిక విషయాన్ని సెలక్టర్లు నిర్ణయిస్తారు. రోహిత్ తన స్థానాన్ని మళ్లీ సంపాదించుకోవాలనుకోవచ్చు. కానీ చివరికి నిర్ణయం సెలక్టర్లదే” అని స్పష్టం చేశారు.
ఇకపోతే రోహిత్ శర్మ చిన్ననాటి కోచ్ చేసిన వ్యాఖ్యలపై కూడా కపిల్ స్పందించారు. రోహిత్ 2027 వరల్డ్ కప్ తర్వాతే అంతర్జాతీయ క్రికెట్‌కు పూర్తిగా వీడ్కోలు పలుకుతాడని కోచ్ పేర్కొన్న నేపథ్యంలో, ఆటగాడిగా చివరి వరకూ పోరాడే లక్షణం రోహిత్‌లో ఉందని చెప్పారు. అతడి బలమైన కెరీర్‌కు శుభాకాంక్షలు తెలుపుతూ, భావి ప్రస్థానానికి ఆశీస్సులు తెలియజేశారు.









