అహ్మదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదంపై ప్రస్తుతం పూర్తి వివరాలు అందుబాటులో లేవని, మృతుల సంఖ్యపై స్పష్టత ఇవ్వడం కష్టమని అహ్మదాబాద్ పోలీస్ కమిషనర్ జి.ఎస్. మాలిక్ తెలిపారు. ఈ ప్రమాదంలో విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు మరియు సిబ్బంది ఉన్నారని చెప్పారు. వారిలో 11ఏ సీటులో ప్రయాణిస్తున్న ఒకరు మాత్రమే ప్రాణాలతో బయటపడినట్లు వెల్లడించారు. ప్రస్తుతం ఆ వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
విమానంలో ఉన్న ప్రయాణికుల వివరాల్లోకి వెళితే, 169 మంది భారతీయులు, 53 మంది బ్రిటన్ పౌరులు, 7 మంది పోర్చుగీసు దేశస్తులు, 1 కెనడా పౌరుడు ఉన్నట్లు అధికారులు తెలిపారు. గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ కూడా ఈ విమానంలోనే ప్రయాణిస్తూ మరణించిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.
విమానం జనావాసాలున్న ప్రాంతంలో కూలిపోవడం వల్ల మట్టికింద పడిన వారు కూడా ఉండే అవకాశముందని కమిషనర్ మాలిక్ ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడి ప్రాంతంలో నివాసాలు, కార్యాలయాలు, విద్యాసంస్థలు ఉన్న కారణంగా, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుతానికి సహాయక చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు.
ఈ ప్రమాదంలో బీజే మెడికల్ కళాశాల హాస్టల్‌లోని కొందరు విద్యార్థులు కూడా మరణించినట్లు ప్రాథమిక సమాచారం అందుతున్నదని పోలీసులు తెలిపారు. విమాన శకలాలను తొలగించేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, స్థానిక పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది కలిసి ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వ యంత్రాంగం పూర్తి స్థాయిలో పనిచేస్తోంది.









