ఆరోగ్యకర సమాజానికి క్రీడలే పునాది – సైనా

Olympian Saina Nehwal attended the sports meet valedictory function in Hyderabad and highlighted the role of sports in student development.

క్రీడలు ఆరోగ్యకరమైన, చైతన్యవంతమైన సమాజ నిర్మాణానికి మూలస్తంభమని భారత బాడ్మింటన్ క్రీడాకారిణి, ఒలింపిక్స్ విజేత, పద్మభూషణ్ సైనా నెహ్వాల్ పేర్కొన్నారు. క్రీడల్లో చురుకుగా పాల్గొనే విద్యార్థులు విద్యాపరంగానూ మెరుగ్గా రాణిస్తారని ఆమె అభిప్రాయపడ్డారు. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన క్రీడాపోటీల ముగింపు ఉత్సవాలకు సైనా నెహ్వాల్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర అడిషనల్ డీజీపీ డా. అనిల్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా సైనా నెహ్వాల్ విద్యార్థులతో కలిసి బాడ్మింటన్ ఆడి వారిని ఉత్సాహపరిచారు. అనంతరం క్రీడా పోటీల్లో పాల్గొని విజేతలుగా నిలిచిన విద్యార్థినీ, విద్యార్థులకు ట్రోఫీలు, కప్పులు, సర్టిఫికెట్లు అందజేశారు. విద్యతో పాటు క్రీడలు మానవ జీవితంలో విడదీయరాని భాగమని సైనా ఈ సందర్భంగా పేర్కొన్నారు.

క్రీడలు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడమే కాకుండా మంచి ఆరోగ్యాన్ని, క్రమశిక్షణను అలవర్చుతాయని సైనా నెహ్వాల్ తెలిపారు. విద్యార్థులు తమ రోజువారీ షెడ్యూల్‌లో క్రీడలను తప్పనిసరిగా చేర్చుకోవాలని సూచించారు. పాఠశాలలు, విద్యాసంస్థలు క్రమం తప్పకుండా క్రీడా పోటీలు, టోర్నమెంట్‌లను నిర్వహించి ప్రతిభావంతులను ప్రోత్సహించాలని ఆమె కోరారు.

డా. అనిల్ కుమార్ మాట్లాడుతూ క్రీడా మౌలిక సదుపాయాలు కల్పించి క్రికెట్, ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, స్విమ్మింగ్ వంటి అన్ని క్రీడల్లో విద్యార్థులను ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్ఎస్ఐఎస్ చైర్మన్ దయానంద్ అగర్వాల్, డైరెక్టర్లు అంజనీ కుమార్ అగర్వాల్, సంజయ్ అగర్వాల్, గర్వ అగర్వాల్, స్పోర్ట్స్ చీఫ్ కోచ్ డా. మురమళ్ళ భారత్ కుమార్, అడ్మిన్ హెడ్ వినోద రంజన్, వైస్ ప్రిన్సిపాల్ పూజ సక్సేనా, హెడ్ ఆఫ్ బోర్డింగ్ రాజేంద్ర ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share