సూరత్ మున్సిపల్ కార్పొరేషన్ తన పరిధిలోని నివాసితులకు ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పుడు ఇంట్లో కుక్కను పెంచాలంటే కేవలం ఇష్టపడ్డంత మాత్రాన సరిపోదు. 10 మంది ఇరుగుపొరుగు నివాసితుల నుంచి తప్పనిసరిగా ఎన్ఓసీ (NOC) తీసుకోవాలని అధికారులు స్పష్టం చేశారు. ఈ కొత్త నిబంధన విధంగా ఇంటి యజమానులు కుక్కను ఉంచుకునే ముందు పరిసరవాసుల అంగీకారం పొందాల్సి ఉంటుంది. ఇది సూరత్‌లో పెంపుడు జంతు యజమానుల్లో కలకలం రేపింది.
ఇది కేవలం ఇండిపెండెంట్ ఇళ్లకే పరిమితం కానందున, అపార్ట్మెంట్లలో నివసించే వారు మరింత జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఎందుకంటే, అపార్ట్మెంట్ బహుళ అంతస్తుల భవనాల వారైతే, ఆ భవన సంక్షేమ సంఘం ఛైర్మన్, కార్యదర్శి నుంచి కూడా తప్పనిసరిగా అనుమతి పత్రాలు పొందాలని కార్పొరేషన్ ఉత్తర్వుల్లో చెప్పింది. ఈ రెండు పత్రాలను సమర్పించాకే ఇంట్లో పెంపుడు కుక్కను ఉంచుకునే హక్కు ఉంటుంది.
ఇలాంటి కఠినమైన నిబంధనలను తీసుకురావడానికి కారణాన్ని అధికారులు వివరించారు. గత మే నెలలో సూరత్‌లో ఒక చిన్నారి కుక్క దాడిలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన జరిగింది. దీని తర్వాత పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. పిల్లల భద్రతను కాపాడేందుకు కఠిన నిబంధనలు అవసరమని అధికారులు భావించారు. దీంతో ఈ నిర్ణయం తీసుకుని కొత్త మార్గదర్శకాలను అమలు చేస్తున్నారు.
ఈ కొత్త నిబంధనలు స్థానికంగా పెంపుడు జంతువుల యజమానుల్లో తీవ్ర చర్చకు దారి తీస్తున్నాయి. కొంతమంది ఈ నియమాలను సమర్థిస్తుంటే, మరికొందరు ఇది చాలా కఠినమని విమర్శిస్తున్నారు. ఇరుగుపొరుగు అనుమతులు పొందడం సులభం కాదని, ఇది పెంపుడు జంతువులను ఉంచే హక్కును హరించకూడదని కొంతమంది అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ, అధికారులు పిల్లల సురక్షే ముఖ్యమని, కొత్త నియమావళి వెనక్కి తీయబోమని స్పష్టంచేశారు.









