2011 ఏప్రిల్ 2.. భారత క్రికెట్ అభిమానుల జీవితంలో చిరస్మరణీయ రోజు. వాంఖడే స్టేడియంలో జరిగిన ఫైనల్లో శ్రీలంకపై గెలిచి టీమిండియా రెండోసారి వన్డే వరల్డ్‌కప్‌ను ముద్దాడింది. 28 ఏళ్ల నిరీక్షణకు తెర దించుతూ కెప్టెన్ ఎంఎస్ ధోనీ సిక్సర్‌తో మ్యాచ్‌ను ముగించాడు. ఆ విజయం భారత క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది.
ఈ గెలుపును గుర్తు చేసుకుంటూ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ భావోద్వేగ ట్వీట్ చేశాడు. “2011 ఏప్రిల్ 2న వంద కోట్ల మంది కోసం పోరాడాం. ఈ విజయం కేవలం ప్రపంచకప్ గెలుపు మాత్రమే కాదు.. సచిన్ టెండూల్కర్‌కు అంకితం చేసిన గొప్ప గౌరవం. అతన్ని చూస్తూ మేము పెరిగాం. ఆ రోజు అతడికి జీవితాంతం గుర్తుండే క్షణాలను ఇచ్చేందుకు మా ప్రాణం పెట్టాం” అంటూ యువీ రాశాడు.
యువీ 2011 వరల్డ్‌కప్‌లో అద్భుత ప్రదర్శనతో ‘ప్లేయర్ ఆఫ్ ద టోర్నమెంట్’గా నిలిచాడు. బౌలింగ్, బ్యాటింగ్ రెండింటిలోనూ ఆకట్టుకున్నాడు. ముఖ్యంగా క్యాన్సర్ బాధతో బాధపడుతూ, ఆరోగ్య సమస్యలను అధిగమిస్తూ తన దేశం కోసం ఆడటం క్రికెట్ ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసింది.
ఈ జయానికి 14 ఏళ్లు అయినా, భారత క్రికెట్ అభిమానుల గుండెల్లో అది నేటికీ చిరస్థాయిగా నిలిచే గర్వకారణం. యువీ, ధోనీ, సచిన్, సెహ్వాగ్, గంభీర్ వంటి ఆటగాళ్లు అందించిన విజయాన్ని ప్రతి భారతీయుడు గర్వంగా గుర్తు చేసుకుంటూనే ఉంటారు.









