ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యువతకు నైపుణ్యాల అభివృద్ధిలో మరో కీలక ముందడుగు వేసింది. రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో, ష్నైడర్ ఎలక్ట్రిక్ ఇండియా ఫౌండేషన్‌తో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (APSSDC) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ద్వారా విద్యుత్, గ్రీన్ ఎనర్జీ, ఆటోమేషన్ రంగాల్లో పెరుగుతున్న అవకాశాలకు యువతను సన్నద్ధం చేయనున్నారు.
2024 ఏప్రిల్ నుండి 2027 మార్చి వరకు రాష్ట్రవ్యాప్తంగా 20 ఆధునిక శిక్షణా ల్యాబ్స్‌ను ష్నైడర్ ఏర్పాటు చేయనుంది. ఈ ల్యాబ్స్‌లో ఆధునిక విద్యుత్ వ్యవస్థలు, సౌరశక్తి పరికరాలు, పారిశ్రామిక ఆటోమేషన్ వంటి ఆధునిక శిక్షణా సామగ్రి అందుబాటులో ఉంటుంది. ఇందులో 9 వేలమంది యువతకు ప్రామాణిక శిక్షణ అందించే లక్ష్యంతో ముందుకు సాగుతోంది.
ల్యాబ్ ఏర్పాటుకు కావలసిన పరికరాలు, డిజిటల్ శిక్షణా సామగ్రి కోసం ష్నైడర్ రూ. 5 కోట్ల వరకు పెట్టుబడి పెట్టనుంది. శిక్షణ పూర్తిచేసిన విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలోనూ ఫౌండేషన్ సహకారం అందించనుంది. మంగళగిరిలో రూ. 15 కోట్లతో ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’ స్థాపించేందుకు కూడా కంపెనీ అంగీకరించింది.
ఈ కార్యక్రమం అమలుకు ఎంపికైన కేంద్రాల్లో నాలుగు న్యాక్ సెంటర్లు, తొమ్మిది ప్రభుత్వ ఐటీఐలు, ఏడు పాలిటెక్నిక్ కళాశాలలు ఉన్నాయి. అనంతపురంలో రీసెర్చ్ సెంటర్, అల్లూరి సీతారామరాజు జిల్లాలో మోడ్రన్ పవర్ ప్రాజెక్ట్ కూడా చేపట్టనున్నారు. ఈ శిక్షణా కార్యక్రమం ఏపీ యువత భవిష్యత్తుకు గట్టినేలు వేసే అవకాశం కలిగించనుంది.









