ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి, పలు కీలక అంశాలపై చర్చించేందుకు ఢిల్లీకి బయలుదేరారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి ప్రయాణం ప్రారంభించారు. ఈ పర్యటనలో భాగంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు ఇతర కేంద్ర మంత్రులతో కీలక సమావేశాలు నిర్వహించనున్నారు.
ఈ రోజు రాత్రి 8 గంటల ప్రాంతంలో ఢిల్లీకి చేరుకోనున్న చంద్రబాబు, రాత్రి 9 గంటలకు అమిత్ షాతో సమావేశమవుతారు. ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలు, ముఖ్యంగా నూతన క్రిమినల్ చట్టాల అమలు పై చర్చించనున్నారు. కేంద్ర హోంశాఖ నిర్వహించే సమీక్షలో ముఖ్యమంత్రి హాజరయ్యే అవకాశం ఉంది.
రేపటి రోజు చంద్రబాబు షెడ్యూల్ పూర్తిగా కేంద్ర మంత్రులతో సమావేశాలతో నిండివుంది. ఉదయం 10 గంటలకు పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషితో భేటీ అయి గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులకు సంబంధించి రాష్ట్రానికి సహకారం కోరనున్నారు. అనంతరం రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్, సైన్స్ అండ్ టెక్నాలజీ శాఖ మంత్రి జితేంద్ర సింగ్, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో వరుస భేటీలు జరగనున్నాయి.
సాయంత్రం 3 గంటలకు నిర్మలా సీతారామన్‌తో సమావేశం అనంతరం, రాత్రి 9 గంటలకు ఎలక్ట్రానిక్స్ & ఐటీ శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్‌తో చివరి భేటీ నిర్వహిస్తారు. మౌలిక సదుపాయాలు, విద్యుత్, నీటి వనరుల వినియోగం వంటి అంశాలపై చర్చలు జరుగుతాయి. ఈ నెల 24న నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొని, అదే రాత్రి బెంగళూరు చేరుకొని అనంతరం కుప్పం వెళ్లి 25న అమరావతికి తిరిగివస్తారు.









