పల్నాడు పర్యటన సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్ పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అమరావతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, “ఇరుకైన గల్లీల్లో సభలు పెట్టి, హింసకు దారితీసేలా ప్రవర్తించడం రాజకీయం కాదని” అన్నారు. పోలీసులపై తప్పుడు ఆరోపణలు చేసి ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించేలా జగన్ వ్యవహరించారని ఆయన అభిప్రాయపడ్డారు.
“పల్నాడు ప్రజలు శాంతియుతంగా జీవించాలనుకుంటున్నారు. కానీ ప్లకార్డులు పట్టుకుని ‘చంపండి’, ‘నరకండి’ అంటూ నినాదాలు చేయడం శోచనీయం. ఇది సమాజానికి మంచి సందేశం కాదని, ఈ ధోరణులు ప్రజాస్వామ్యానికి ముప్పు” అని సీఎం హెచ్చరించారు. గంజాయి, బెట్టింగ్ మాఫియాలకు విగ్రహాలు పెడతారా? అని ప్రశ్నించిన చంద్రబాబు, “ఇది యువతకు ఏ విధంగా మార్గనిర్దేశం చేస్తుంది?” అని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు, జగన్ పరామర్శించిన నాగమల్లేశ్వరరావు మరణంపై కూడా చంద్రబాబు మండిపడ్డారు. “ఆయన మరణం వైసీపీ అధికారంలో ఉన్న సమయంలో జరిగింది. అప్పట్లో పట్టించుకోని వారు ఇప్పుడు ఎలా విచారం వ్యక్తం చేస్తారు?” అని నిలదీశారు. రాజకీయ లబ్ధి కోసం మృతుల పేరును వినియోగించడం నైతికంగా తప్పని సీఎం వ్యాఖ్యానించారు. రౌడీయిజానికి రాజకీయ మద్దతు ఇచ్చే ప్రయత్నాన్ని ప్రజలు సహించరని అన్నారు.
జగన్ పర్యటనలో “రప్పా రప్పా” నినాదాలపై కూడా సీఎం తీవ్రంగా స్పందించారు. “ఇవాళ యోగా దినోత్సవం జరుపుకుంటే, మరోవైపు హింసను ప్రోత్సహించే నినాదాలేంటో అర్థం కావడం లేదు. ప్రజలను రెచ్చగొట్టేలా ఈ ప్రవర్తన సాగుతోందని పేర్కొన్నారు. చట్టాన్ని ఉల్లంఘించేవారిపై చర్యలు తప్పవని, రాష్ట్రాన్ని గందరగోళంలోకి నెట్టు ప్రయత్నం చేసిన వారికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారని చంద్రబాబు స్పష్టం చేశారు.









