ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు మరియు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. “ముసుగు వీడింది, నిజం తేటతెల్లమైంది. 48వ ఢిల్లీ పర్యటన గుట్టు రట్టయింది” అంటూ ఆయన ఎక్స్ (Twitter) వేదికగా ట్వీట్ చేశారు. ఈ భేటీ వెనుక ఉన్న రాజకీయ కుట్ర బయటపడిందని, ఇది తెలంగాణ ప్రజలకు నష్టం కలిగించే పరిణామమని వ్యాఖ్యానించారు.
కేటీఆర్ ఆరోపణల ప్రకారం, రాహుల్ గాంధీకి నిధులు, చంద్రబాబుకు నీళ్లు… బూడిద మాత్రం తెలంగాణ ప్రజలకు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణకు కీలకమైన బనకచర్ల ప్రాజెక్టుపై సమావేశంలో చర్చించలేదన్న విషయాన్ని గుర్తుచేస్తూ, ఇది తెలంగాణ హక్కులపై రాజీ చేయడమేనని విమర్శించారు. “గురుదక్షిణగా గోదావరి నీటిని అప్పగించడానికే ఈ కలయిక జరుగుతోందా?” అంటూ ఆయన ప్రశ్నించారు.
“జై తెలంగాణ” అనటానికి సిగ్గు వేసే వారు, నాలుగు కోట్ల ప్రజల హక్కులను పరాయి రాష్ట్రానికి అప్పగించడంలో మాత్రం వెనకాడరని కేటీఆర్ మండిపడ్డారు. “కోవర్టులు ఎవరు, తెలంగాణ కోసం పోరాడినవారు ఎవరో తేలిపోయింది” అని వ్యాఖ్యానించారు. రెండు రాష్ట్రాల మధ్య రాజకీయ గోడలు తొలగించాలన్న రేవంత్ భావనను వ్యంగ్యంగా విమర్శిస్తూ, “ఇంకెందుకు రెండు రాష్ట్రాలు? సరిహద్దులు చెరిపేయి!” అంటూ విరుచుకుపడ్డారు.
తీవ్రంగా హెచ్చరిస్తూ, “ఒక్క బొట్టు నీరు అక్రమంగా ఇవ్వాలని చూసినా, మరో ఉద్యమం ఊపొస్తుంది” అని పేర్కొన్నారు. “ప్రాంతేతరుడు మోసం చేస్తే తరిమి కొడతాం… ప్రాంతవాడు మోసం చేస్తే పాతిపెడతాం” అని హెచ్చరించిన కేటీఆర్, తెలంగాణను లూటీ చేయాలని చూస్తున్న వారిని నియంత్రించే సమయం వచ్చిందని స్పష్టం చేశారు. రాష్ట్ర హక్కుల పరిరక్షణ కోసం ప్రజలంతా అడ్డుగోడగా నిలవాలని పిలుపునిచ్చారు.









