రాహుల్ వ్యాఖ్యలతో లోక్‌సభ రచ్చ – సభ వాయిదా

లోక్‌సభ సమావేశాల్లో తీవ్ర గందరగోళం చోటు చేసుకోవడంతో సభను స్పీకర్ ఓం బిర్లా సాయంత్రం నాలుగు గంటల వరకు వాయిదా వేశారు. చైనా సైన్యం భారత సరిహద్దుల్లోకి చొరబడుతోందని ఆర్మీ మాజీ చీఫ్ మనోజ్ ముకుంద్ నరవణే తన పుస్తకంలో పేర్కొన్న అంశాలను ఓ మ్యాగజైన్ ప్రచురించింది. ఈ అంశాలను ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లోక్‌సభలో ప్రస్తావించడంతో ఒక్కసారిగా సభలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై బీజేపీ సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్ ఈ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఇంకా అధికారికంగా ప్రచురితం కాని పుస్తకంలోని విషయాలను సభలో ప్రస్తావించడం సరికాదని రాజ్‌నాథ్ సింగ్ ప్రశ్నించారు. దీనితో అధికార, ప్రతిపక్ష సభ్యుల మధ్య వాగ్వాదం మరింత పెరిగింది.

ఈ క్రమంలో లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కూడా జోక్యం చేసుకుని రాహుల్ గాంధీపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్లమెంట్ సభ్యుడిగా తన హోదాకు తగిన విధంగా మాట్లాడాలని సూచించారు. సభలో నినాదాలు, అరుపులు కొనసాగడంతో పరిస్థితి అదుపు తప్పి, సభను తాత్కాలికంగా వాయిదా వేయాల్సి వచ్చింది.

మరోవైపు రాహుల్ గాంధీ మాట్లాడుతుండగా మైక్ కట్ చేశారంటూ కాంగ్రెస్ నేతలు ఆరోపణలు చేశారు. ఇది ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని వారు వ్యాఖ్యానించారు. రాహుల్ వ్యాఖ్యలు, కేంద్ర మంత్రుల ప్రతిస్పందనలతో లోక్‌సభ రాజకీయ వేడి మరింత పెరిగింది.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share