కాంగ్రెస్‌కు నవజ్యోత్ కౌర్ సిద్ధూ రాజీనామా

పంజాబ్ రాజకీయాల్లో పెను సంచలనం చోటుచేసుకుంది. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ నవజ్యోత్ కౌర్ సిద్ధూ కాంగ్రెస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని ఆమె సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో పాటు, పంజాబ్ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు అమరీందర్ సింగ్ రాజా వారింగ్‌ను లక్ష్యంగా చేసుకుని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆయనను అత్యంత భయంకరమైన, అసమర్థుడైన, అవినీతిపరుడైన నాయకుడిగా అభివర్ణించారు.

గత ఏడాది డిసెంబర్‌లో ముఖ్యమంత్రి పదవికి రూ.500 కోట్ల సూట్‌కేసు అవసరం అన్న వ్యాఖ్యల నేపథ్యంలో పార్టీ నుంచి సస్పెన్షన్‌కు గురైన నవజ్యోత్ కౌర్ సిద్ధూ, ఇప్పుడు ఏకంగా రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాజా వారింగ్ తన స్వార్థ ప్రయోజనాల కోసం కాంగ్రెస్ పార్టీని ఆమ్ ఆద్మీ పార్టీకి అమ్ముకున్నారని ఆమె ఆరోపించారు. జైలు శిక్ష నుంచి తప్పించుకోవడానికి ఆయన పంజాబ్ ముఖ్యమంత్రితో లోపాయికారీ ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు.

నవజ్యోత్ సింగ్ సిద్ధూను రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో రాజా వారింగ్ కుట్రలు చేస్తున్నారని నవజ్యోత్ కౌర్ సిద్ధూ ధ్వజమెత్తారు. గత ఎన్నికల్లో సిద్ధూ ఓటమికి సహకరించిన నేతలకు పార్టీలో కీలక పదవులు అప్పగిస్తూ, సమర్థులైన నాయకులను పక్కన పెట్టారని ఆరోపించారు. పార్టీలో నిజాయితీగా పనిచేసే నాయకులకు ఎలాంటి గుర్తింపు లేదని, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె స్పష్టం చేశారు.

ఇదే సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనకు ముందే ఆమె రాజీనామా చేయడం, మోడీ పాలనను ప్రశంసించడం రాజకీయంగా ఆసక్తిని రేపుతోంది. మోడీ హయాంలో పాలనలో పారదర్శకత ఉందని పేర్కొంటూ, రాష్ట్రానికి ఏదైనా ఇవ్వడానికి వస్తున్న నాయకుడిని అడ్డుకోవడం సరికాదని వ్యాఖ్యానించారు. రాజా వారింగ్ కేవలం సోషల్ మీడియా రీల్స్‌లోనే పరిమితమవుతూ ప్రజల్లో నవ్వుల పాలవుతున్నారని ఎద్దేవా చేశారు. ఈ పరిణామాలతో సిద్ధూ దంపతులు తిరిగి బీజేపీలో చేరే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share