నల్గొండ జిల్లా రెండు రకాల తీవ్రవాదాలకు కేంద్రంగా మారిందని బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాదం మాత్రమే కాదు, ఇస్లామిక్ తీవ్రవాద సంస్థలైన ఐఎస్ఐ సంబంధిత కార్యకలాపాలు కూడా జిల్లాలో జరుగుతున్నాయని ఆరోపించారు.
ఇవన్నీ బీజేపీ ఎదుగుదలపై దాడులేనని వ్యాఖ్యానించారు. ఇటీవల పహల్గామ్లో హిందువులపై జరిగిన ఉగ్రదాడిని ప్రస్తావిస్తూ, దేశంలో పరిస్థితులు భయంకరంగా మారుతున్నాయని, వివిధ రూపాల్లో జిహాద్ జరుగుతోందని తెలిపారు. మదర్సాల ద్వారా కూడా తీవ్రవాద బోధనలు జరుగుతున్నాయనే అనుమానాన్ని రఘునందన్ వ్యక్తం చేశారు.
జిల్లాలోని మదర్సాలను ప్రభుత్వ యంత్రాంగం తనిఖీ చేయాలనీ, అక్కడ నివసించే వారెవరు, వారెంతవరకూ నిబంధనల ప్రకారం ఉన్నారనే అంశాలను పరిశీలించాలని డిమాండ్ చేశారు. మదర్సాలపై సమగ్ర విచారణ జరిపి పారదర్శకత తీసుకురావాలని కోరారు. ప్రభుత్వ యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లకు లోనవకుండా వ్యవహరించాలన్నారు.
సికింద్రాబాద్, కొమురవెల్లి, జిన్నారం లాంటి ఆలయాల్లో జరిగిన అపవిత్ర సంఘటనలపై కూడా రఘునందన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మానసిక రోగుల పేరిట ఆలయాలే లక్ష్యంగా ఎందుకు దాడులు జరుగుతున్నాయో ప్రశ్నించారు. ఈ దాడులపై నిజమైన దర్యాప్తు జరగాలని, మత సామరస్యాన్ని దెబ్బతీసే చర్యలను ప్రభుత్వం తప్పక అణిచివేయాలని డిమాండ్ చేశారు.









