కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత శశిథరూర్‌పై మరో నేత మురళీధరన్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా కలకలం రేపాయి. శశిథరూర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారని, ఆయనను తిరువనంతపురంలో జరిగే కార్యక్రమాలకు ఆహ్వానించబోమని మురళీధరన్ ప్రకటించారు. పార్టీ ప్రయోజనాలకంటే దేశ ప్రయోజనాలు ముఖ్యమని తారూర్ ఇటీవల వ్యాఖ్యానించిన నేపథ్యంలో ఈ ప్రకటన వెలువడింది.
ఈ వ్యాఖ్యలపై శశిథరూర్ మీడియాతో మాట్లాడుతూ తీవ్రంగా స్పందించారు. “ఇలాంటి వ్యాఖ్యలు చేయడానికి మురళీధరన్‌కు ఎలాంటి అధికారం ఉంది? అలాంటి వ్యాఖ్యలకు ఆధారాలేమైనా ఉన్నాయా?” అని ప్రశ్నించారు. తన తీరుపై ఆధారాలు లేకుండా మాట్లాడటం సరికాదని ఆయన విమర్శించారు. పార్టీలోని కొంతమంది అనవసరంగా తనపై ఆరోపణలు చేస్తున్నారని చెప్పారు.
తన గురించి తప్ప వేరే వాళ్ల గురించి మాట్లాడదల్చుకోలేదని తారూర్ స్పష్టం చేశారు. “మీరు ఇతరుల వ్యాఖ్యల గురించి నన్ను అడిగితే, నేను స్పందించను. నేను నా పనితీరుపై మాత్రమే మాట్లాడగలను. పార్టీ అధిష్ఠానం నాకు ఏమైనా చెప్తే, నేను దానిపై స్పందిస్తాను. కానీ వ్యక్తిగత విమర్శలకు స్పందించాల్సిన అవసరం లేదు,” అని తారూర్ స్పష్టం చేశారు.
మరోవైపు, మురళీధరన్ మాత్రం తారూర్‌పై నేరుగా వ్యంగ్యాస్త్రాలు విసిరారు. “ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదు. అతని తీరు మార్చుకోకపోతే మేమూ ఆయనకు అవకాశం ఇవ్వం. అయితే, తారూర్‌ను బహిష్కరించలేదనే విషయాన్ని స్పష్టంగా చెప్పాలా?” అంటూ వివరణ ఇచ్చారు. తారూర్‌పై ఏ నిర్ణయం తీసుకోవాలో అధిష్ఠానం నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. దీంతో కాంగ్రెస్‌లో అంతర్గతంగా వాదోపవాదాలు ముదిరినట్టు స్పష్టమవుతోంది.









