తెలంగాణ ప్రజలు కోరుకున్న మార్పును ప్రజా ప్రభుత్వం రెండేళ్ల వ్యవధిలోనే స్పష్టంగా చూపించిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. ప్రజలు తమపై ఉంచిన విశ్వాసాన్ని నిలబెట్టుకోవడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పేర్కొన్నారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పుడు రాష్ట్రం తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలో ఉందని, అయినప్పటికీ సంకల్పంతో ముందుకు సాగుతూ ఆ పరిస్థితులను అధిగమించామని తెలిపారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో దశలవారీగా సంక్షోభం నుంచి బయటపడి అభివృద్ధి, సంక్షేమానికి సమాన ప్రాధాన్యత ఇస్తూ పాలన సాగిస్తున్నామని మంత్రి చెప్పారు. ప్రజా ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయం ప్రజల జీవితాల్లో ప్రత్యక్ష మార్పును తీసుకొస్తోందన్నారు. వ్యవసాయం, విద్య, వైద్యం, గృహ నిర్మాణం, ఉపాధి కల్పన వంటి రంగాల్లో చేపట్టిన చర్యలు ప్రజలకు లాభం చేకూరుస్తున్నాయని వివరించారు.
ఈ మార్పులను ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకెళ్లడంలో సమాచార, ప్రజాసంబంధాల శాఖ కీలక పాత్ర పోషిస్తోందని మంత్రి తెలిపారు. ప్రస్తుత కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతికతను వినియోగించి ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను వేగంగా ప్రజలకు చేరవేయాలని అధికారులకు సూచించారు. ఈ దిశగా సమాచార శాఖను మరింత బలోపేతం చేస్తున్నామని అన్నారు.
సోమవారం సచివాలయంలో తన ఛాంబర్లో ఆధునీకరించిన సమాచార పౌరసంబంధాల శాఖ వెబ్‌సైట్‌ను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ప్రభుత్వం రెండేళ్ల పాలన పూర్తి చేసుకుని మూడో వసంతంలోకి అడుగుపెట్టిందన్నారు. ఆరు గ్యారంటీల అమలుతో పాటు మరిన్ని సంక్షేమ పథకాలను అమలు చేశామని చెప్పారు. ఆర్థిక వృద్ధిలో తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని, తెలంగాణ రైజింగ్–2047 విజన్‌తో రాష్ట్రాన్ని దేశ, ప్రపంచ స్థాయిలో ముందుకు తీసుకెళ్లడం లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందని స్పష్టం చేశారు









