సాంకేతిక దిగ్గజం గూగుల్ మరోసారి వినూత్న ప్రోత్సాహంతో ముందుకొచ్చింది. భూకంపాలను ముందుగానే గుర్తించి హెచ్చరించే ఫీచర్‌ను ఇప్పుడు వేర్ ఓఎస్ స్మార్ట్‌వాచ్‌లకు విస్తరించబోతోంది. ఇప్పటికే ఆండ్రాయిడ్ స్మార్ట్ఫోన్లలో అందుబాటులో ఉన్న ఈ ఫీచర్ ఇప్పుడు చేతిపై ఉండే వాచ్ ద్వారానే వినియోగదారులకు హెచ్చరికలు అందించబోతుంది. గూగుల్ తన తాజా సిస్టమ్ రీలీజ్ నోట్స్‌లో ఈ కీలక విషయాన్ని ప్రకటించింది.
గూగుల్ ఈ భూకంప హెచ్చరిక వ్యవస్థను మొదటిగా 2020లో ఆండ్రాయిడ్ ఫోన్ల కోసం ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ఫోన్లోని యాక్సిలరోమీటర్ సెన్సార్ ఉపయోగించి భూమి ప్రకంపనలను గుర్తిస్తుంది. ఆ డేటాను గూగుల్ సర్వర్లకు పంపించి, సమీప వినియోగదారులకు సెకన్ల ముందే హెచ్చరికలు పంపుతుంది. భారతదేశంలో ఈ ఫీచర్ 2023 సెప్టెంబరులో అందుబాటులోకి వచ్చింది. లక్షలాది ఫోన్ల నెట్‌వర్క్‌తో ఇది వేగంగా పని చేస్తోంది.
ఇప్పుడు ఈ వ్యవస్థ వేర్ ఓఎస్ వాచ్లకు రావడం వల్ల వినియోగదారులకు మరింత భద్రత కలుగుతుంది. ఫోన్ దగ్గర లేకపోయినా లేదా అది సైలెంట్ మోడ్‌లో ఉన్నా, వాచ్ వాడుతున్నవారికి భూకంప సమాచారం నేరుగా స్క్రీన్‌పై కనిపిస్తుంది. భూకంప తీవ్రత, దూరం వంటి కీలక సమాచారం కూడా ప్రదర్శించబడుతుంది. ఎల్టీఈ వాచ్‌లు ఉన్నవారికి ఫోన్ అవసరం లేకుండా హెచ్చరికలు అందుతాయి.
భూకంప ప్రభావిత ప్రాంతాల్లో నివసించే ప్రజలకు ఇది నిజంగా ప్రాణ రక్షణకు దోహదపడే ఫీచర్. కొన్ని సెకన్ల ముందస్తు హెచ్చరిక కూడా ప్రాణాలు కాపాడే అవకాశాన్ని కల్పిస్తుంది. అయితే భారతదేశంలో వేర్ ఓఎస్ వాచ్లకు ఈ ఫీచర్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందన్న దానిపై గూగుల్ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు. అయినప్పటికీ, ఈ తాజా అప్డేట్ భద్రతను పెంచే దిశగా గూగుల్ తీసుకుంటున్న మరో చురుకైన అడుగుగా నిలుస్తుంది.









