భారత్, పాకిస్థాన్‌ల మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలు దేశీయ స్టాక్ మార్కెట్లును కుదిపేశాయి. ‘ఆపరేషన్ సిందూర్’ పేరిట భారత సైన్యం చేపట్టిన చర్య అనంతరం, పాకిస్థాన్ వైపు నుంచి సరిహద్దు రాష్ట్రాలపై డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేయడానికి ప్రయత్నాలు జరిగాయి. దీనికి ప్రతిగా భారత దళాలు పాకిస్థాన్‌లో మోహరించిన గగనతల రక్షణ వ్యవస్థలను లక్ష్యంగా చేసుకున్నాయి. ఈ దాడుల్లో లాహోర్‌లోని పాకిస్థాన్ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ ధ్వంసమైందని భారత రక్షణ శాఖ వర్గాలు వెల్లడించాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో, ఉదయం లాభాలతో ప్రారంభమైనప్పటికీ, చివరి గంటలో అమ్మకాల ఒత్తిడి తీవ్రరూపం దాల్చడంతో సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఫలితంగా సెన్సెక్స్ 400 పాయింట్లకు పైగా పతనమవ్వగా, నిఫ్టీ కీలకమైన 24,300 స్థాయికి దిగువన ముగిసింది.
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలున్నప్పటికీ, దేశీయ సూచీలు ఉదయం ఉత్సాహంగానే మొదలయ్యాయి. బీఎస్ఈ సెన్సెక్స్ క్రితం ముగింపు 80,746.78 పాయింట్లతో పోలిస్తే, 80,912.34 పాయింట్ల వద్ద లాభాల్లో ప్రారంభమైంది. రోజంతా స్వల్ప శ్రేణిలో లాభనష్టాల మధ్య కదలాడిన సూచీ, సరిహద్దుల్లో ఉద్రిక్తతలు పెరిగాయన్న వార్తలతో చివరి గంటలో ఒక్కసారిగా అమ్మకాల ఒత్తిడికి లోనైంది. చివరకు సెన్సెక్స్ 411.97 పాయింట్ల నష్టంతో 80,334.81 వద్ద స్థిరపడింది.
అదేవిధంగా, నిఫ్టీ కూడా 140 పాయింట్లు కోల్పోయి 24,273.80 వద్ద ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 85.72 వద్ద కొనసాగుతోంది. మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ సూచీలు కూడా నష్టాలను మూటగట్టుకున్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ సూచీ 1.95 శాతం, నిఫ్టీ స్మాల్‌క్యాప్ సూచీ 1.43 శాతం మేర క్షీణించాయి.
సెన్సెక్స్‌లోని 30 కంపెనీలలో ఎటర్నల్, మహీంద్రా అండ్ మహీంద్రా, మారుతీ సుజుకీ, బజాజ్ ఫైనాన్స్, టాటా స్టీల్ షేర్లు ప్రధానంగా నష్టపోయిన వాటిలో ఉన్నాయి. హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, కోటక్ మహీంద్రా బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, టైటాన్, టాటా మోటార్స్ షేర్లు లాభాలతో ముగిశాయి.
పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్-లో ప్రకంపనలు వచ్చాయి. భారత్ సైనిక చర్యల కారణంగా పాక్ స్టాక్ మార్కెట్ కుదేలైంది. ‘ఆపరేషన్ సిందూర్’ ప్రభావంతో నిన్న భారీగా నష్టపోయిన పాక్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (పీఎస్ఎక్స్), నేడు ట్రేడింగ్ సమయంలో అరగంట పాటు నిలిచిపోయింది. కరాచీ సమీపంలో భారత సైనిక దళాలు విరుచుకుపడ్డాయన్న వార్తలు వ్యాపించడంతో మదుపరులు భయాందోళనలకు గురై, అమ్మకాలకు తెగబడ్డారు. ట్రేడింగ్ నిలిపివేతకు ముందు కేఎస్‌ఈ 100 సూచీ ఏకంగా 6,948 పాయింట్లు (6.32 శాతం) పతనమై 103,060 వద్ద నిలిచింది. కొంత సమయం తర్వాత ట్రేడింగ్ పునఃప్రారంభమైనప్పటికీ, నష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.









