గురువారం భారత స్టాక్ మార్కెట్లు తీవ్రమైన నష్టాలను ఎదుర్కొన్నాయి. అంతర్జాతీయంగా అమెరికా-ఇరాన్ మధ్య పెరుగుతున్న ఉద్రిక్తతలు, ముడి చమురు ధరల పెరుగుదల, అమెరికా వాణిజ్య విధానాల్లో అనిశ్చితి వంటి అంశాలు మదుపరుల్లో భయం, అస్థిరతను పెంచాయి. ఫలితంగా, మదుపరులు భారీగా అమ్మకాలకు దిగడంతో మార్కెట్లు పతనమయ్యాయి. ఉదయం నుంచే సూచీలు ఒడిదుడుకుల మధ్య కదిలినా, చివరికి తీవ్ర నష్టాలతో ముగిశాయి.
బీఎస్ఈ సెన్సెక్స్ 823 పాయింట్లు కోల్పోయి 81,691 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్ సమయంలో ఒక దశలో 81,523 పాయింట్ల కనిష్ఠానికి పడిపోయింది. NSE నిఫ్టీ 253 పాయింట్లు నష్టపోయి 24,888 వద్ద ముగిసింది. టాటా మోటార్స్, టైటాన్, పవర్ గ్రిడ్, ఎల్&టీ, మహీంద్రా అండ్ మహీంద్రా వంటి షేర్లు అత్యధికంగా నష్టపోయాయి. బజాజ్ ఫిన్‌సర్వ్, ఏషియన్ పెయింట్స్, టెక్ మహీంద్రా మాత్రమే లాభాల్లో ముగిశాయి.
బ్రాడర్ మార్కెట్లూ తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. నిఫ్టీ మిడ్‌క్యాప్ 1.73%, స్మాల్‌క్యాప్ 1.90% మేర నష్టపోయాయి. అన్ని రంగాల సూచీలు నష్టాల్లోనే ముగిశాయి. ముఖ్యంగా రియల్టీ సూచీ 2% పైగా పడిపోయింది. ఫీనిక్స్ మిల్స్, డీఎల్ఎఫ్, గోద్రెజ్ ప్రాపర్టీస్, శోభా లిమిటెడ్ వంటి ప్రధాన కంపెనీల షేర్లు 3% వరకు నష్టపోయాయి. ఇతర రంగాలు కూడా 1% పైగా నష్టాన్ని చవిచూశాయి.
జియోజిత్ ఇన్వెస్ట్‌మెంట్స్ కు చెందిన వినోద్ నాయర్ ప్రకారం, “మార్కెట్లు ప్రస్తుతం హై వాల్యూయేషన్, గెపొలిటికల్ రిస్క్స్, అమెరికా ఆర్థిక విధానాలపై అనిశ్చితితో వేచిచూస్తున్నాయి. ఈ పరిణామాల నేపథ్యంలో బంగారం లాంటి సురక్షిత పెట్టుబడుల వైపు మదుపరులు మొగ్గుచూపుతున్నారు.” ఇండియా VIX సూచీ 2.54% పెరిగి 14.01కి చేరడం కూడా మార్కెట్ భయాన్ని సూచిస్తోంది.









