వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడింది. దాని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రానున్న నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (ఏపీఎస్డీఎంఏ) తెలిపింది. అల్పపీడనం ఒడిశా-పశ్చిమ బెంగాల్ తీర ప్రాంతాల సమీపంలో గురువారం (జూన్ 26) ఏర్పడిందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఈ అల్పపీడనం ప్రభావంతో శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, విశాఖపట్నం, కాకినాడ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, కడప, చిత్తూరు వంటి జిల్లాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశముంది. అక్కడక్కడ భారీ వర్షాలు కురవవచ్చని వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. వర్షాలతో పాటు పిడుగులు పడే అవకాశం కూడా ఉందని పేర్కొన్నారు.
అలాగే, గంటకు 40 నుంచి 60 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని, వాన వేళల్లో విద్యుత్ స్తంభాలు, చెట్ల కింద ఉండరాదని ఏపీఎస్డీఎంఏ సూచించింది. లోతట్టు ప్రాంతాల్లో ఉండే ప్రజలు ఎప్పటికప్పుడు అధికారుల సూచనలపై దృష్టి పెట్టాలని, అవసరమైతే సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని కోరింది.
రైతులు తమ వ్యవసాయ పనుల్లో జాగ్రత్తలు పాటించాలని, వానలకు లోనయ్యే పంటలను సురక్షితంగా కాపాడుకోవాలని సూచించింది. వర్షాల సమయంలో ప్రయాణాలు అవసరమైతే మాత్రమే చేయాలని, అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. వాతావరణ పరిస్థితులను గమనిస్తూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని విపత్తుల నిర్వహణ సంస్థ పిలుపునిచ్చింది.









