దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. ట్రేడింగ్ ఆరంభంలో సూచీలు భారీ లాభాల్లో ట్రేడయ్యాయి. ఒక దశలో సెన్సెక్స్ 900 పాయింట్లకుపైగా ఎగబాకగా, నిఫ్టీ కూడా మంచి లాభాల్లో కొనసాగింది. అయితే, మధ్యాహ్నం తర్వాత ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు మళ్లీ క్షీణించాయి.
రోజు ముగింపు సమయానికి సెన్సెక్స్ 259 పాయింట్ల లాభంతో 80,501 వద్ద ముగిసింది. నిఫ్టీ 12 పాయింట్ల స్వల్ప లాభంతో 24,346 వద్ద నిలిచింది. మిడ్ కాప్, స్మాల్ కాప్ సూచీలు కూడా స్వల్ప లాభాలు నమోదు చేశాయి. డాలర్ మారకం విలువతో పోలిస్తే రూపాయి రూ. 84.50 వద్ద ట్రేడ్ అయ్యింది.
ఈరోజు బీఎస్ఈలో టాప్ గెయినర్స్‌గా అదానీ పోర్ట్స్ (4.11%), బజాజ్ ఫైనాన్స్ (2.62%), ఎస్బీఐ (1.51%), మారుతి (1.21%) నిలిచాయి. బ్యాంకింగ్, ఫైనాన్స్, ఆటోమొబైల్ రంగాల్లో కొనుగోళ్ల కారణంగా మార్కెట్‌కు మద్దతు లభించింది.
అయితే, నెస్లే ఇండియా (-2.04%), ఎన్టీపీసీ (-1.61%), టైటాన్ (-1.09%), కోటక్ బ్యాంక్ (-0.94%) వంటి స్టాక్స్ నష్టాలను మూటగట్టుకున్నాయి. పవర్, ఎఫ్ఎంటీజీ రంగాల్లో అమ్మకాలు భారీగా నమోదయ్యాయి. మొత్తంగా మార్కెట్లు లాభాల్లో ముగిసినప్పటికీ, నిఫ్టీలో స్వల్ప పెరుగుదల మాత్రమే కనిపించింది.









