కొంతకాలంగా 5జీ టెక్నాలజీ వల్ల మానవ ఆరోగ్యానికి ప్రమాదమని ప్రచారం సాగుతోంది. అయితే తాజాగా వెలువడిన ఒక శాస్త్రీయ అధ్యయనం ఈ అపోహలకు శాశ్వత Full Stop వేసింది. అధిక తీవ్రత కలిగిన 5జీ విద్యుదయస్కాంత తరంగాలు మానవ కణాలపై ఎలాంటి హానికర ప్రభావాలు చూపవని ఈ అధ్యయనం స్పష్టంగా పేర్కొంది. ఈ పరిశోధన ఫలితాలు ప్రఖ్యాత జర్నల్ ‘PNAS Nexus’లో ప్రచురించబడ్డాయి.
జర్మనీలోని కన్స్ట్రక్టర్ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. వారు మానవ చర్మ కణాలను – ఫైబ్రోబ్లాస్ట్లు మరియు కెరాటినోసైట్లు – తీసుకుని, 27 GHz నుంచి 40.5 GHz మధ్య మిల్లీమీటర్-వేవ్ తరంగాలకు గురిచేశారు. ఇది భవిష్యత్తులో వాడకానికి వస్తున్న 5జీ ఫ్రీక్వెన్సీ బ్యాండ్లను కవర్ చేస్తుంది. ఈ కణాలను 2 నుంచి 48 గంటల పాటు పరీక్షించి, అత్యధిక స్థాయిలో రేడియేషన్కి గురిచేశారు.
అతిపెద్ద ఆశ్చర్యం ఏమిటంటే – ఇంత తీవ్రమైన రేడియేషన్కి గురైనా, కణాల్లోని జన్యు వ్యక్తీకరణలలో (gene expression), డీఎన్ఏ మిథైలేషన్ (DNA methylation) సరళిలో ఎలాంటి మార్పులు కనిపించలేదు. ఇవి కణ ఆరోగ్యానికి కీలక సూచికలు. శాస్త్రవేత్తల అభిప్రాయం ప్రకారం, 10 GHzకి పైగా ఉండే తరంగాలు చర్మం లోతుగా ప్రవేశించలేవు, కాబట్టి లోతైన జీవక్రియలపై వాటి ప్రభావం తక్కువగా ఉంటుంది.
ఈ అధ్యయనం ప్రధానంగా నాన్-థర్మల్ ప్రభావాలపై దృష్టి పెట్టింది. అంటే, వేడి లేకుండానే 5జీ రేడియేషన్ వల్ల ఎలాంటి దుష్ప్రభావాలు ఏర్పడతాయా అనే కోణాన్ని పరిశీలించింది. పరిశోధకులు “వేడి కలగనంతవరకూ 5జీ రేడియేషన్ హానికరమేమీ కాదు” అని తేల్చారు. ఇది ప్రజల్లో ఉన్న అనవసర భయాలపై స్పష్టమైన సమాధానమని చెప్పవచ్చు. అయితే స్క్రీన్ వాడకాన్ని బట్టి వచ్చే మానసిక ప్రభావాలపై ఇంకా పరిశోధనలు అవసరమే.









