తెలంగాణలో 18,973 లైసెన్సులు సస్పెన్షన్

Telangana cracks down with 18,973 license suspensions; EVs get ₹369 crore tax waiver to boost green mobility.

తెలంగాణలో ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘిస్తున్న వాహనదారులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతోంది. నిర్లక్ష్యంగా వాహనం నడిపే వారిపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు రవాణా శాఖ ప్రకటించింది. గత 19 నెలల కాలంలో రాష్ట్రవ్యాప్తంగా 18,973 డ్రైవింగ్ లైసెన్సులను సస్పెండ్ చేసినట్లు శుక్రవారం విడుదల చేసిన ప్రగతి నివేదికలో వివరించింది. ముఖ్యంగా మద్యం తాగి వాహనం నడపడం, అతివేగం వంటి తీవ్రమైన ఉల్లంఘనలకు పాల్పడిన వారి లైసెన్సులు రద్దు చేసినట్లు తెలిపింది. ఈ గణాంకాలు 2023 డిసెంబర్ నుండి 2025 జూన్ వరకు నమోదైనవిగా పేర్కొంది.

పర్యావరణాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పెద్దఎత్తున రాయితీలు అందిస్తోంది. రాష్ట్రంలోని ఈవీ యజమానులకు రోడ్ ట్యాక్స్, రిజిస్ట్రేషన్ ఫీజులో 100 శాతం మినహాయింపు ఇస్తున్నట్లు రవాణా శాఖ నివేదిక తెలిపింది. 2024 నవంబర్ 16 నుండి 2025 జూన్ 30 వరకు 49,633 ఈవీలకు మొత్తం రూ.369.27 కోట్ల పన్నులు మినహాయించారని వివరించింది. ఈ విధంగా ప్రజలను పర్యావరణహిత వాహనాల వాడకానికి ప్రోత్సహిస్తోంది.

రవాణా శాఖ సేవల్లో ఆధునికతను తీసుకురావడానికి మరిన్ని చర్యలు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు. డ్రైవింగ్ నైపుణ్యాన్ని మరింత కచ్చితంగా పరీక్షించేందుకు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 25 ద్విచక్ర, 27 ఫోర్ వీలర్, 5 భారీ వాహనాల టెస్టింగ్ ట్రాక్‌లను ఆటోమేటెడ్ డ్రైవింగ్ టెస్ట్ ట్రాక్‌లుగా మార్చనున్నట్లు చెప్పారు. ఆగస్టు చివరి నాటికి వాహన సంబంధిత సేవలను ‘వాహన్’ యాప్ ద్వారా డిజిటల్‌గా అందించనున్నట్లు తెలిపారు.

రాష్ట్ర వాహనాల రిజిస్ట్రేషన్ కోడ్‌ను ‘టీఎస్’ నుంచి ‘టీజీ’గా మార్చిన విషయం తెలిసిందే. ఈ మార్పు 2024 మార్చి 15 నుంచి అమల్లోకి వచ్చింది. జూన్ 30 నాటికి రాష్ట్రంలో 13.05 లక్షల వాహనాలు ‘టీజీ’ కోడ్‌తో రిజిస్టర్ అయ్యాయని నివేదికలో వెల్లడించారు. ఈ మార్పుతో వాహన రిజిస్ట్రేషన్లను మరింత సమర్థంగా నిర్వహించే అవకాశం ఏర్పడిందని అధికారులు తెలిపారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share