కాంగ్రెస్ ప్రభుత్వంలోనే గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి సాధ్యమవుతుందని వైరా మండలం విప్పలమడక గ్రామ సర్పంచ్ మేడా హేమిమా చక్రపాణి అన్నారు. మంగళవారం విప్పలమడక గ్రామంలో ఆర్ అండ్ బి రోడ్డునుంచి శివాలయం వరకు డీఎంఎఫ్టీ నిధులు రూ.7 లక్షలతో నిర్మించనున్న సీసీ రోడ్డుకు ఆమె శంకుస్థాపన చేశారు. అనంతరం గ్రామంలోని ఈజీఎస్ నర్సరీలో ప్లాంటేషన్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ విప్పలమడక గ్రామ అభివృద్ధిలో వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఎమ్మెల్యే ఇచ్చిన హామీ మేరకు శివాలయానికి సీసీ రోడ్డును నిర్మించేందుకు నిధులు మంజూరు చేశారని వివరించారు. గ్రామ ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని అభివృద్ధి పనులు చేపడుతున్నామని చెప్పారు.
విప్పలమడక గ్రామానికి ఈజీఎస్, ఎస్సీ సబ్ ప్లాన్, ఎస్డిఎఫ్‌తో పాటు పలు ప్రభుత్వ పథకాల ద్వారా ఎమ్మెల్యే అత్యధిక నిధులు కేటాయించారని సర్పంచ్ తెలిపారు. గ్రామ అభివృద్ధికి నిరంతరం సహకరిస్తున్న ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్‌కు ఆమె ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అలాగే ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి కూడా గ్రామ అభివృద్ధికి సహకారం అందిస్తానని హామీ ఇచ్చినట్లు వెల్లడించారు.
ఇక విప్పలమడక గ్రామాన్ని అవేర్ స్వచ్ఛంద సంస్థ దత్తత తీసుకున్నట్లు తెలిపారు. ఆ సంస్థ ద్వారా కూడా త్వరలో గ్రామాభివృద్ధికి మరిన్ని నిధులు మంజూరయ్యే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బూర్గు లూర్థమ్మ, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు, వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి తదితరులు పాల్గొన్నారు.









