తెలంగాణ నుంచి అనేకమంది క్రీడాకారులు అంతర్జాతీయ స్థాయికి ఎదిగారని, స్పోర్ట్స్ అభివృద్ధిలో మైదానాలు మరియు మౌలిక వసతుల పాత్ర కీలకమని రాష్ట్ర క్రీడా మంత్రి అజారుద్దీన్ తెలిపారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ రెండో రోజు కార్యక్రమాల్లో నిర్వహించిన ‘ఒలింపిక్ గోల్డ్ క్వెస్ట్’ చర్చలో పాల్గొన్న ఆయన, గోపీచంద్ అకాడమీ నుంచి భారత క్రీడలకు విశేషమైన ప్రతిభ వచ్చిన విషయం గుర్తుచేశారు. ఫుట్‌బాల్ సహా అన్ని క్రీడలను ప్రభుత్వం సమానంగా ప్రోత్సహిస్తోందని చెప్పారు.
ఈ చర్చలో పీవీ సింధు, సైనా నెహ్వాల్, గుత్తా జ్వాల వంటి క్రీడాకారులు దేశానికి మంచి పేరు తెచ్చుకున్నారని అజారుద్దీన్ అభినందించారు. క్రీడాకారులకు ఆర్థిక ఇబ్బందులు రాకుండా ప్రభుత్వం ప్రత్యేక విధానాలు అమలు చేస్తున్నదన్నారు. ప్రతిభ ఉన్న క్రీడాకారులకు అండదండలు, సరైన ప్రోత్సాహం, అవసరం అయితే ఉద్యోగావకాశాలు కూడా కల్పించాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. క్రీడా పాలసీ రాష్ట్రానికి పెద్ద దన్నుగా మారుతుందని చెప్పారు.
చర్చలో మాట్లాడిన ఒలింపిక్ ఛాంపియన్ పీవీ సింధు, క్రీడాకారుల ఎదుగుదలకు మౌలిక వసతులు, అద్భుత కోచ్‌లు, ప్రతి దశలో సరైన ప్రోత్సాహం ఎంతో అవసరమని పేర్కొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి క్రీడల పట్ల చూపుతున్న మద్దతు ఎంతో అభినందనీయమని, రాబోయే సంవత్సరాల్లో తెలంగాణ నుంచి మరిన్ని అంతర్జాతీయ క్రీడాకారులు వెలుగు చూడనున్నారని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా పుల్లెల గోపీచంద్ మాట్లాడుతూ, హైదరాబాద్ దేశంలోనే అత్యుత్తమ క్రీడా నగరాల్లో ఒకటిగా నిలుస్తోందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించిన విజన్ 2047 నిజంగా అద్భుతమైనదని, స్పోర్ట్స్ సిటీ, స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్పోర్ట్స్ హబ్‌లు రాష్ట్ర క్రీడాల భవిష్యత్తును మార్చనున్నాయని అన్నారు. రేవంత్ రెడ్డి దేశంలోనే అత్యంత ఫిట్ సీఎంలలో ఒకరని, ఆయన క్రమశిక్షణ, ఫిట్‌నెస్ పట్ల ఉన్న నిబద్ధత యువతకు పెద్ద ప్రేరణగా నిలుస్తుందని గోపీచంద్ అభిప్రాయపడ్డారు. సమ్మిట్‌లో భాగస్వామిగా ఉండటం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు.









