నల్గొండలో కలకలం రేపిన ఘటన
నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల హాస్టల్లో ఉంటూ బీఎస్సీ, బీజెడ్సీ చదువుతున్న వై. హిమశ్రీ అనారోగ్య కారణాలతో యాసిడ్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. వెంటనే తోటి విద్యార్థులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఆమెను నల్గొండ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
విద్యార్థినిని పరామర్శించిన కలెక్టర్
ఈ ఘటనపై స్పందించిన జిల్లా కలెక్టర్ బి. చంద్రశేఖర్ సోమవారం ఆసుపత్రికి వెళ్లి హిమశ్రీని పరామర్శించారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. హిమశ్రీతో మాట్లాడి ధైర్యంగా ఉండాలని సూచిస్తూ, ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.
తండ్రితో మాట్లాడిన కలెక్టర్
విద్యార్థిని తండ్రి వై. వెంకటేశ్వర్లుతో కలెక్టర్ ప్రత్యేకంగా మాట్లాడి సంఘటనకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మెరుగైన వైద్యం కోసం తన కూతురిని హైదరాబాద్కు తరలించాలని హిమశ్రీ తండ్రి కోరగా, కలెక్టర్ వెంటనే నిమ్స్ వైద్యులతో మాట్లాడి మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ పంపించేందుకు ఏర్పాట్లు చేశారు.
విద్యార్థిని వివరాలు
నల్గొండ జిల్లా అనుముల మండలం హాజారిగూడెంకు చెందిన వై. హిమశ్రీ, నల్గొండ ఎన్.జి. కళాశాలలో బీఎస్సీ, బీజెడ్సీ రెండో సంవత్సరం చదువుతోంది. నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బీసీ బాలికల బీ హాస్టల్లో ఉంటూ చదువుకుంటోంది. కలెక్టర్ వెంట డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ వేణుగోపాల్ రెడ్డి, జీజీహెచ్ సూపరింటెండెంట్ నేత నరసింహారావు, గృహ నిర్మాణ శాఖ పీడీ రాజ్ కుమార్ పాల్గొన్నారు.









