నారాయణపేట మండలం లింగంపల్లి గ్రామంలో సర్పంచ్ ఎన్నికల నామినేషన్లపై వివాదం చెలరేగింది. ఇద్దరు అభ్యర్థులు సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు చేయగా, ఎన్నికల రిటర్నింగ్ అధికారి మొదట రెండు నామినేషన్లు స్వీకరించబడ్డాయని నోటీసు బోర్డుపై ప్రకటించారు. అయితే సాయంత్రం ఐదు గంటల తర్వాత ఒక్కసారిగా ఒక అభ్యర్థి నామినేషన్‌ను రిజెక్ట్ చేసినట్లు తెలపడంతో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చ ప్రారంభమైంది.
ఈ నిర్ణయంపై బీజేపీ సీనియర్ నాయకుడు నాగురావ్ నామాజీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నామినేషన్ స్క్రూటినీ తర్వాత అప్పీల్‌కు సమయం ఇవ్వకుండా రిజెక్షన్ చేపట్టడం ఎన్నికల నియమావళి స్పష్టమైన ఉల్లంఘనగా పేర్కొన్నారు. ఎవరూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకోవడానికి అధికారం లేదని, నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిందేనని ఆయన హెచ్చరించారు.
అలాగే పేరపల్లి గ్రామ రెండవ వార్డ్‌లో కూడా ఇలాంటి ఎన్నికల నియమావళి ఉల్లంఘనలు జరిగినట్లు నామాజీ ఆరోపించారు. ఈ విషయంపై కలెక్టర్, ఆర్డీవోలకు అధికారిక ఫిర్యాదు సమర్పించినట్లు వెల్లడించారు. అధికారులు వెంటనే స్పందించి నిబంధనలను అమలు చేయాలని, ఎన్నికల ప్రక్రియ నిష్పక్షపాతంగా జరగాలని డిమాండ్ చేశారు.
తగిన చర్యలు తీసుకోకపోతే హైకోర్టును ఆశ్రయించడానికైనా వెనుకాడబోమని నామాజీ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు సత్య యాదవ్, పోషల్ వినోద్, రఘువీర్, నందు నామాజీ, కిరణ్ తదితర నేతలు పాల్గొన్నారు.









