శాంతి భద్రతల కోసం సొంత నిధులతో సీసీ కెమెరాలు

మండల కేంద్రంలో శాంతి భద్రతల పరిరక్షణకు గ్రామ ప్రజాప్రతినిధులు ముందడుగు వేశారు. గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య ఆధ్వర్యంలో తమ సొంత నిధులతో సీసీ కెమెరాల ఏర్పాటుకు రూ.1,00,000 విలువైన చెక్కును శుక్రవారం ఎస్సై మహేష్ గౌడ్‌కు అందజేశారు. గ్రామ భద్రతపై ప్రజాప్రతినిధులు చూపిన ఈ చొరవ స్థానికంగా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
మండల కేంద్రంలోని ముఖ్య కూడళ్లలో, ప్రజా రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ కెమెరాల ద్వారా నేరాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ పర్యవేక్షణ కూడా మరింత సమర్థవంతంగా చేయవచ్చని గ్రామ సర్పంచ్ పురుగుల యాదయ్య తెలిపారు. అలాగే అత్యవసర పరిస్థితుల్లో తక్షణ చర్యలు తీసుకోవడానికి ఈ వ్యవస్థ ఎంతో ఉపయోగపడుతుందని ఆయన పేర్కొన్నారు.
గ్రామ భద్రతకు ప్రజా ప్రతినిధులు బాధ్యతాయుతంగా వ్యవహరించడం అభినందనీయమని సర్పంచ్ పేర్కొన్నారు. ప్రభుత్వ నిధులపై మాత్రమే ఆధారపడకుండా, ప్రజల భద్రత కోసం సొంత వనరులను వినియోగించడం మంచి ఉదాహరణగా నిలుస్తుందని ఆయన అన్నారు. ఈ నిర్ణయం గ్రామాభివృద్ధి పట్ల తమ నిబద్ధతను చాటుతోందని చెప్పారు.
ఈ సందర్భంగా ఎస్సై మహేష్ గౌడ్ మాట్లాడుతూ.. గ్రామ ప్రజాప్రతినిధుల సహకారం పోలీసు శాఖకు ఎంతో తోడ్పడుతుందని అన్నారు. సీసీ కెమెరాల ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేసి వాటిని వినియోగంలోకి తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ భాస్కర్, వార్డ్ మెంబర్స్ శివకుమార్, మల్లేష్, సత్యనారాయణ, జంగయ్య, మురళి, శైలజకృష్ణ, రఫీ, రాజు తదితరులు పాల్గొన్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share