తెలంగాణ ప్రాజెక్టులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభ్యంతరాలు చెప్పడంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. గోదావరి-బనకచర్ల ప్రాజెక్టుపై అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపనున్నట్లు వెల్లడించారు. తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ ప్రభుత్వం ఎన్ఓసీలు ఇస్తే, తమవైపు నుంచి ఎలాంటి అభ్యంతరాలు ఉండవని స్పష్టంగా తెలిపారు. ఇది ప్రజల జీవనాధారమైన నీటి ప్రాజెక్టుల అంశం కాబట్టి రాజీకి తావులేదన్నారు.
చంద్రబాబు పాలనలో కేంద్రంతో సంబంధాలు ఉన్నా, రాష్ట్ర ప్రయోజనాలపై రాజీ పడితే సహించబోమని రేవంత్ హెచ్చరించారు. కేంద్ర ప్రభుత్వ అనుమతులు తప్పనిసరి అనుకోవడం భ్రమ అని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రాజెక్టులపై తెలంగాణ ప్రభుత్వానికి వ్యూహాలు సిద్ధంగా ఉన్నాయని, అన్ని రాజ్యాంగబద్ధ సంస్థలకు ఫిర్యాదు చేసిన తర్వాత న్యాయస్థానాలద్వారా పోరాటం చేస్తామని చెప్పారు. అక్కడ న్యాయం జరగకపోతే ప్రజల్లోకి వెళ్లి ఉద్యమిస్తామని అన్నారు.
గతంలో కేసీఆర్ – జగన్ సమావేశంలో గోదావరి జలాలపై ఒప్పందం జరిగిందని, రాయలసీమకు నీటిని తరలించేందుకు కేసీఆర్ అంగీకరించిన విషయాన్ని రేవంత్ గుర్తు చేశారు. “నమస్తే తెలంగాణ”లో వచ్చిన కథనాలను ప్రస్తావిస్తూ, అప్పటి ప్రభుత్వం చేసిన తప్పుల వల్లే ఇప్పుడు తెలంగాణకు ఇబ్బందులు వస్తున్నాయని విమర్శించారు. కృష్ణా నీటి వాటా తగ్గించుకున్నప్పటికీ ప్రశ్నించని తీరు తెలంగాణ రైతులకి అన్యాయం చేసిందన్నారు.
బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర సీఎం వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆనాటి ఒప్పందం తెలంగాణ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొనే జరిగింది అన్నది నిజమని, ఇప్పుడు దానిని వక్రీకరించడం రాజకీయ ప్రయోజనాల కోసమేనని విమర్శించారు. రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణ కోసం అన్ని పార్టీలతో కలిసి ముందుకెళ్తామని సీఎం చెప్పినా, ఇది పూర్తిగా రాజకీయ దురుద్దేశంతో నడుస్తోందని బీఆర్ఎస్ ఆరోపించింది.









