వివిధ కారణాల వల్ల సంవత్సరాలుగా క్లెయిమ్ చేయకుండా మిగిలిపోయిన ప్రజల ఆర్థిక ఆస్తులను తిరిగి అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రారంభించిన ‘మీ డబ్బు – మీ హక్కు’ కార్యక్రమాన్ని జిల్లా ప్రజలు విస్తృతంగా సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పిలుపునిచ్చారు. బుధవారం ఐడీఓసీ కార్యాలయం సమావేశ మందిరంలో ఈ కార్యక్రమంపై బ్యాంకులు, ప్రభుత్వ శాఖల సమన్వయంతో విస్తృత అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజలకు చెందవలసిన కానీ ఇప్పటివరకు క్లెయిమ్ చేయని బ్యాంకు డిపాజిట్లు, షేర్లు, డివిడెండ్లు, మ్యూచువల్ ఫండ్ పెట్టుబడులు, బీమా పాలసీల రాబడులు వంటి ఆర్థిక ఆస్తులను తిరిగి పొందేందుకు ఈ కార్యక్రమం ఎంతో ఉపయోగకరమని తెలిపారు. బ్యాంకుల్లో 10 సంవత్సరాలకు పైగా క్లెయిమ్ చేయని డిపాజిట్ల వివరాలను ఆర్‌బీఐ నిర్వహిస్తున్న ‘ఉద్గమ్’ వెబ్‌సైట్ ద్వారా తెలుసుకొని, సంబంధిత బ్యాంకులను సంప్రదించడం ద్వారా సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చని వివరించారు.
జిల్లా వ్యాప్తంగా వివిధ బ్యాంకులు, ఆర్థిక సంస్థల్లో సుమారు రూ.46 కోట్ల మేర అన్‌క్లెయిమ్ డిపాజిట్లు ఉన్నాయని కలెక్టర్ వెల్లడించారు. ఈ మొత్తాలు తిరిగి ప్రజలకు అందితే వారి కుటుంబాల ఆర్థిక భద్రతకు, సంక్షేమానికి ఎంతో దోహదపడతాయని పేర్కొన్నారు. ప్రజల్లో అవగాహన పెంచేందుకు ఏపీఎం పరిధిలోని సీసీలు, మహిళా సమాఖ్యలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు గ్రామస్థాయిలో ఇంటింటి ప్రచారం నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.
అలాగే ప్రభుత్వ శాఖల్లో పేరుకుపోయిన అన్‌క్లెయిమ్ డిపాజిట్లను డిసెంబర్ 31లోపు తప్పనిసరిగా క్లియర్ చేయాలని, నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీసులు జారీ చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా అన్‌క్లెయిమ్ డిపాజిట్లను విజయవంతంగా క్లెయిమ్ చేసుకున్న లబ్ధిదారులకు జిల్లా కలెక్టర్ చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ విద్యా చందన, ఆర్‌బీఐ ఎల్డీఓ, బ్యాంకు అధికారులు, ప్రజాప్రతినిధులు, పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.









