నిర్లక్ష్య వైద్యులపై కలెక్టర్ సంతోష్ ఆగ్రహం

నాగర్‌కర్నూల్ జిల్లా పెద్ద కొత్తపల్లి మండలం వెన్నచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యుల నిర్లక్ష్యం కలెక్టర్ ఆగ్రహానికి కారణమైంది. గురువారం జిల్లా కలెక్టర్ బాధావత్ సంతోష్ ఆకస్మికంగా వెన్నచర్ల పీహెచ్‌సీని తనిఖీ చేయగా, వైద్యుల విధుల పట్ల నిర్లక్ష్యం వెలుగులోకి వచ్చింది. ఈ సందర్భంగా డాక్టర్ ప్రశాంత్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసిన కలెక్టర్.. ప్రజల ప్రాణాలతో చెలగాటం సహించబోమని స్పష్టం చేశారు.
వెన్నచర్ల పీహెచ్‌సీలో సరైన వైద్య సేవలు అందించలేకపోతే ఉద్యోగం వదిలి వెళ్లాలని కలెక్టర్ హెచ్చరించారు. రాజీనామా చేసి వెళ్లిపోవాలని స్పష్టంగా ఆదేశిస్తూ నిర్లక్ష్య వైద్యులపై కఠిన చర్యలు తప్పవని తేల్చి చెప్పారు. వైద్య సేవల విషయంలో ఎలాంటి రాజీ ఉండదని, ప్రజలకు నాణ్యమైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు.
ఈ తనిఖీ సందర్భంగా కలెక్టర్ ఓపీ నమోదు విభాగం, ల్యాబొరేటరీ, ఇన్‌పేషెంట్ వార్డు, ప్రసూతి విభాగం, మందుల పంపిణీ కేంద్రం వంటి విభాగాలను క్షుణంగా పరిశీలించారు. రోగులకు అవసరమైన పరీక్షలు సక్రమంగా జరుగుతున్నాయా, మందులు సమయానికి అందుతున్నాయా అనే అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
గర్భిణీ స్త్రీలకు పూర్తి స్థాయి వైద్య పరీక్షలు, సురక్షిత ప్రసూతి సేవలు, చిన్నారులకు టీకాలు, సాధారణ మరియు అత్యవసర చికిత్సలు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. అలాగే ఆసుపత్రి పరిశుభ్రత, రికార్డుల నిర్వహణ, సిబ్బంది హాజరు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని స్పష్టంగా హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share