ఫిబ్రవరి 11న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కుతోంది. నామినేషన్ల ప్రక్రియలో భాగంగా ఇప్పటికే పలు మున్సిపాలిటీల్లో ఏకగ్రీవ ఫలితాలు వెలువడుతున్నాయి. ఇప్పటివరకు మొత్తం 9 మున్సిపాలిటీల్లో 14 వార్డులు ఏకగ్రీవంగా నిర్ణయమవ్వడం రాష్ట్ర రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.
ఈ 14 ఏకగ్రీవ వార్డుల్లో 12 వార్డులను కాంగ్రెస్ పార్టీ దక్కించుకోవడం విశేషంగా మారింది. మిగిలిన రెండు వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ పరిణామాలు మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
వార్డుల వారీగా చూస్తే సూర్యాపేట మున్సిపాలిటీలో అత్యధికంగా నాలుగు వార్డులు ఏకగ్రీవమయ్యాయి. హుజూర్నగర్లో ఒక వార్డు, కోదాడ మున్సిపాలిటీలో మూడు వార్డులు, వికారాబాద్ మున్సిపాలిటీలో రెండు వార్డుల్లో ఏకగ్రీవ ఫలితాలు వెలువడ్డాయి. అలాగే మహబూబ్నగర్, రామగుండం కార్పొరేషన్లలో ఒక్కో డివిజన్లో ఏకగ్రీవ ఎన్నిక జరగగా, యాదాద్రి భువనగిరి జిల్లాలో రెండు వార్డులు ఏకగ్రీవమయ్యాయి.
మొత్తం 100 స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్న కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే వస్తున్న ఏకగ్రీవ ఫలితాలు బలాన్నిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ విజయాన్ని సులభంగా సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయని రాజకీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఫిబ్రవరి 11న జరిగే పోలింగ్ తర్వాత రాష్ట్రస్థాయి రాజకీయాల్లో కీలక మార్పులు చోటు చేసుకునే అవకాశముందని విశ్లేషకులు చెబుతున్నారు.









