ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య సాగు, తాగునీటి సమస్యలను పరిష్కరించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రావడాన్ని కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) హర్షిస్తోంది. ఈ విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో చర్చలకు కేంద్రం సిద్ధమవ్వడాన్ని స్వాగతిస్తున్నట్టు సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ ప్రకటించారు. నదులపై రెండు రాష్ట్రాల వాటాలను ఖచ్చితంగా నిర్ణయించిన తర్వాతే కొత్త ప్రాజెక్టులపై ముందుకు వెళ్లాలని సూచించారు. నీటి విషయంలో ఇరు రాష్ట్రాలు రాజీకి రావాలన్నారు.
తెలంగాణలో రాజకీయ పరిస్థితులను విశ్లేషించిన నారాయణ, టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్గా మారిన తర్వాత తెలంగాణ సెంటిమెంట్ పూర్తిగా తగ్గిపోయిందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఎలాంటి ప్రత్యేక సెంటిమెంట్ లేదని, ప్రజలు అభివృద్ధికి ఓటేస్తున్నారని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజలచేత ఎన్నుకోబడిన నాయకుడని, ఆయనపై వ్యక్తిగత విమర్శలు చేయడం సరికాదన్నారు. “పొట్టివాడు గట్టివాడు” అని రేవంత్‌ను అభివర్ణించారు.
నీటి రాజకీయాలు తల్లిని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేయడమేనని నారాయణ వ్యాఖ్యానించారు. బనకచర్ల ప్రాజెక్టుపై తొలుత తనే స్పందించానని తెలిపారు. చంద్రబాబు ఈ ప్రాజెక్టుపై అతిగా మాట్లాడారని విమర్శించారు. ఇప్పటికే అనేక పెండింగ్‌లో ఉన్న నీటి ప్రాజెక్టులను పూర్తి చేయకుండా బనకచర్లను తెరపైకి తీసుకురావడం సమంజసం కాదన్నారు. ముందుగా ఉన్న పనులను పూర్తిచేసే క్రమంలోనే కొత్త ప్రాజెక్టులను ఆలోచించాలని స్పష్టం చేశారు.
బనకచర్ల ప్రాజెక్టు తక్కువ ఖర్చుతో కూడినదేమీ కాదని, దీని వ్యయం రూ. 80 వేల కోట్లు కాక, రూ. 2 లక్షల కోట్లు అవుతుందని నారాయణ తెలిపారు. ఈ ప్రాజెక్టు ప్రాధాన్యత గలదే కాక, వ్యయపరంగా రాష్ట్రాలపై భారం క్రమంగా పెరగవచ్చని అన్నారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలు పరస్పరం అర్థం చేసుకుంటూ, వివాదాలకు తావు లేకుండా ప్రాజెక్టులను చేపట్టాలని సూచించారు. రాజకీయ లబ్ధికోసం నీటి సమస్యలను చర్చకు తీసుకురావడం కంటే, ప్రజల అవసరాలకే ప్రాధాన్యత ఇవ్వాలన్నారు.









