బీజేపీతోనే అభివృద్ధి- రూ.500 కోట్ల హామీ

మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే రాష్ట్రానికి రూ.500 కోట్ల వరకు కేంద్ర నిధులు తీసుకొస్తానని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ స్పష్టం చేశారు. హుజూరాబాద్‌లో జరిగిన కార్నర్ మీటింగ్‌లో ఆయన మాట్లాడుతూ, బీజేపీకి అధికారం ఇస్తే అభివృద్ధి తథ్యమని పేర్కొన్నారు. హుజూరాబాద్ మున్సిపల్ చైర్మన్ పదవిని బీజేపీకి అప్పగిస్తే ఢిల్లీ స్థాయిలో పోరాడి పట్టణానికి భారీ నిధులు తీసుకొచ్చి సంపూర్ణ అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు.
గ్రామ పంచాయతీలకు కేంద్ర ప్రభుత్వం తాజాగా రూ.259 కోట్ల నిధులు విడుదల చేసిందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తాను కలసి చేసిన ప్రయత్నాల వల్లే ఈ నిధులు మంజూరయ్యాయని చెప్పారు. కాంగ్రెస్ పాలనలో మున్సిపాలిటీలకు అభివృద్ధి శూన్యమని విమర్శించారు. ప్రజలను మోసం చేసే హామీలు బీజేపీ ఇవ్వదని, మాట ఇస్తే కచ్చితంగా అమలు చేస్తామని స్పష్టం చేశారు.
హుజూరాబాద్‌లో మినీ స్టేడియం నిర్మాణానికి కేంద్రం నిధులు ఇచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే అడ్డంకులు సృష్టించిందని బండి సంజయ్ ఆరోపించారు. ఎన్నికలు పూర్తయ్యాక స్టేడియం పనులు వెంటనే ప్రారంభమయ్యేలా చర్యలు తీసుకుంటానని తెలిపారు. అభివృద్ధి పనులను అడ్డుకునే శక్తుల్ని ప్రజలే నిలదీయాలని ఆయన కోరారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వం హుజూరాబాద్ పట్టణానికి అందించిన నిధులపై పూర్తి వివరాలతో బుక్‌లెట్‌ను ముద్రించి ఇంటింటికీ పంపిస్తున్నామని చెప్పారు. 14, 15వ ఆర్థిక సంఘం నిధులు, స్వచ్ఛ భారత్, అమృత్, స్వనిధి, యూఐడీఎఫ్ పథకాల ద్వారా కోట్ల రూపాయలు మంజూరయ్యాయని వివరించారు. రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు, స్మశాన వాటికల నిర్మాణం వంటి మౌలిక సదుపాయాలన్నీ కేంద్ర నిధులతోనే సాధ్యమయ్యాయని బండి సంజయ్ స్పష్టం చేశారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share