తెలంగాణ రాజకీయాల్లో మరోసారి మాటల యుద్ధం రాజుకుంది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై ఘాటు స్పందన తెలియజేశారు. తనపై డ్రగ్స్ కేసులకు సంబంధం ఉందని ఢిల్లీలో జరిగిన ఓ చిట్‌చాట్‌లో రేవంత్ చేసిన వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. “నా మీద ఏదైనా డ్రగ్స్ కేసు నమోదైందా? అలాంటి కేసుల్లో నాకు సంబంధాలున్నట్టు ఆధారాలు ఉంటే దమ్ముంటే బయటపెట్టు,” అంటూ కేటీఆర్ సవాల్ విసిరారు.
రెవంత్ నేరుగా తనకు ఎదిరించే ధైర్యం లేక, చుట్టూ తిరుగుతూ అసత్య ప్రచారం చేస్తున్నారని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తాను ఎటువంటి తప్పూ చేయలేదని, తన పాత్ర పూర్తిగా స్వచ్ఛంగా ఉందని స్పష్టం చేశారు. “నాకెదురుగా నిలబడి చెప్పే ధైర్యం లేకుండా, ఢిల్లీలోని ప్రెస్ మీట్లలో చిట్‌చాట్ పేరుతో నిందలు వేయడం రేవంత్ చౌక రాజకీయాలకు నిదర్శనం,” అని వ్యాఖ్యానించారు.
ఇలాంటి అసత్య ఆరోపణలు చేయడం కొత్త కాదని రేవంత్ గతంలో కూడా చాలామందిపై ఈ విధంగా విమర్శలు చేసినట్లు గుర్తు చేశారు. తనపై ఈసారి చేసిన ఆరోపణలను తేలికగా తీసుకోనని, న్యాయపరంగా పోరాడతానని స్పష్టం చేశారు. “ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి నిరాధార ఆరోపణలు చేయడం దురదృష్టకరం,” అని విమర్శించారు. కోర్టులో కేసు వేస్తానని, చట్టపరంగా ఎదుర్కొనాలని హెచ్చరించారు.
తప్పుడు ఆరోపణలకు రేవంత్ తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని, తన పరువును కాపాడుకునేందుకు అవసరమైతే ఎలాంటి చర్యకైనా వెనకాడబోనని కేటీఆర్ అన్నారు. “క్షమాపణలు చెప్పకుంటే పర్యవసనాలు తీవ్రంగా ఉంటాయి,” అంటూ చివర్లో గట్టిగా హెచ్చరించారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో మరోసారి వేడెక్కించిన విషయం నిజమే.









