పరీక్షలు పండుగలే.. భయం కాదు- మోదీ సందేశం

పరీక్షలు అంటే భయం కాదని, అవి మనల్ని మనం పరీక్షించుకునే పండుగలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. శుక్రవారం ఢిల్లీలోని తన నివాసంలో జరిగిన ‘పరీక్షా పే చర్చ’ 9వ ఎడిషన్‌లో భాగంగా దేశవ్యాప్తంగా వచ్చిన విద్యార్థులతో ఆయన ముఖాముఖిగా గడిపారు. ఈ సందర్భంగా పరీక్షలపై ఉండే ఒత్తిడిని దరిచేరనీయకుండా, నేర్చుకోవడమే ప్రధాన లక్ష్యంగా ముందుకు సాగాలని విద్యార్థులకు ప్రధాని పిలుపునిచ్చారు.
అత్యంత ఆత్మీయంగా సాగిన ఈ సంభాషణలో విద్యార్థులు అడిగిన ప్రశ్నలకు ప్రధాని తనదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు. పరీక్షలు జీవితాన్ని నిర్ణయించేవి కాదని, అవి కేవలం ఒక దశ మాత్రమేనని తెలిపారు. మార్కుల కోసం కాకుండా, జ్ఞానం కోసం చదవాలని, ప్రతి అనుభవం మనల్ని మెరుగైన వ్యక్తులుగా మార్చుతుందని చెప్పారు. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే విజయం తానే వస్తుందని ధైర్యం నింపారు.
చదువుకునే విధానంపై విద్యార్థులు గందరగోళానికి గురి కావద్దని ప్రధాని మోదీ సూచించారు. ‘ప్రతి ఒక్కరికి ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుంది. అందరి సలహాలు వినండి, కానీ మీకు నచ్చిన, మీకు అలవాటైన పద్ధతిలోనే చదువును కొనసాగించండి’ అని స్పష్టం చేశారు. ఇతరులను అనుకరించేందుకు ప్రయత్నించకుండా, తమ బలాలను గుర్తించి వాటిపై నమ్మకం ఉంచాలని హితవు పలికారు.
పరీక్షల సమయంలో శారీరక, మానసిక ఆరోగ్యం చాలా ముఖ్యమని ప్రధాని గుర్తు చేశారు. సరైన నిద్ర, సమతుల్యమైన ఆహారం, చిన్న విరామాలు కూడా చదువులో భాగమేనని అన్నారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు విద్యార్థులపై అనవసర ఒత్తిడి పెట్టకుండా ప్రోత్సహించాలని కోరారు. చివరగా, పరీక్షలను ఒక అవకాశంగా చూసి, ఆనందంగా ఎదుర్కోవాలని ప్రధాని మోదీ విద్యార్థులకు సూచించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share