కవితపై తప్పుడు ప్రచారం.. జాగృతి నేతల హెచ్చరిక

Telangana Jagruthi leaders warned against false propaganda on Kavitha and strongly condemned V Prakash’s remarks.

రేవంత్ రెడ్డి మాటలనే కవిత మాట్లాడుతున్నారంటూ వి.ప్రకాశ్ అనే వ్యక్తి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని తెలంగాణ జాగృతి వర్కింగ్ ప్రెసిడెంట్ రూప్‌సింగ్, సీనియర్ నాయకుడు సయ్యద్ ఇస్మాయిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. కవితపై పథకం ప్రకారమే అవాస్తవ ఆరోపణలు చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు.

వి.ప్రకాశ్ చరిత్ర తెలంగాణ ప్రజలందరికీ తెలుసని, హరీశ్‌రావు ఏర్పాటు చేసుకున్న ఫేక్ టీమ్‌కు లీడర్‌లా వ్యవహరిస్తూ మాట్లాడుతున్నారని వారు ఆరోపించారు. స్వయం ప్రకటిత మేధావిగా చెప్పుకునే వి.ప్రకాశ్ గతంలో కేసీఆర్, కేటీఆర్‌లపై కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడిన విషయాన్ని గుర్తుచేశారు. 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కేసీఆర్, కేటీఆర్ అహంకారమే కారణమని వ్యాఖ్యానిస్తూ ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేశారని విమర్శించారు.

వి.ప్రకాశ్ ఒక ప్యాకేజీ స్టార్ అని, అవసరానికి తగ్గట్టు మాటలు మారుస్తారని జాగృతి నేతలు ధ్వజమెత్తారు. అంతేకాదు, ఒక గొప్ప సామాజిక విప్లవ నేత మరణానికి కూడా ఆయనే కారణమని ఆరోపించారు. ఆధారాలు ఉంటే బహిరంగ చర్చకు సిద్ధమని సవాల్ విసిరారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తే సహించబోమని హెచ్చరించారు.

కవితపై అవాకులు పేలితే నాలుక చీరేస్తామని తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. సోషల్ మీడియాలో కవితపై తప్పుడు ప్రచారాలు చేస్తున్న గుంటనక్కల సమూహానికి సరైన జవాబు చెబుతామని స్పష్టం చేశారు. నిరాధారమైన ఆరోపణలు, నిందలు కొనసాగితే రాజకీయంగానే కాకుండా చట్టపరంగానూ ఎదుర్కొంటామని జాగృతి నేతలు తేల్చిచెప్పారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share