హైదరాబాద్‌లో విదేశీ మహిళా డ్రగ్స్ స్మగ్లర్లు అరెస్ట్

Masab Tank police arrested two foreign women and seized cocaine, MDMA worth ₹2.6 lakh during a drug delivery in Hyderabad.

హైదరాబాద్ నగరంలో డ్రగ్స్ ముఠాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఈ క్రమంలో మాసబ్ ట్యాంక్ పోలీసులు ఇద్దరు విదేశీ మహిళా డ్రగ్స్ స్మగ్లర్లను అరెస్ట్ చేసి భారీ మొత్తంలో నిషేధిత మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకున్నారు. జాంబియాకు చెందిన ఎమెలీ ములిండే అలియాస్ క్యాథీ హంచబిలా (29), మలావికి చెందిన ఎలెనా కసకతిరా (48) ఈ కేసులో పట్టుబడ్డారు.

ఇన్స్పెక్టర్ పరుశురాం తెలిపిన వివరాల ప్రకారం, ఈ ఇద్దరూ ముంబైలోని బోరివలి ప్రాంతంలో నివాసం ఉంటూ, ఒక నైజీరియన్ డ్రగ్ పెడ్లర్ ఆదేశాల మేరకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ నెల 18న హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని జీవీకే మాల్ వెనుక ప్రాంతంలో 43.7 గ్రాముల కొకైన్, 11.5 గ్రాముల ఎండిఎంఏను డెలివరీ చేసినట్లు నిందితులు ఒప్పుకున్నారు.

స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ విలువ సుమారు రూ.2,60,000గా పోలీసులు అంచనా వేశారు. డ్రగ్స్ డెలివరీ అనంతరం నిందితులు ముంబైకి పారిపోవడానికి పలుమార్లు ప్రయత్నించగా, మాసబ్ ట్యాంక్ పోలీసులు చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,50,000 నగదు, ఒక నకిలీ పాస్‌పోర్ట్, రెండు మొబైల్ ఫోన్లు, బస్సు ప్రయాణ పత్రాలను కూడా స్వాధీనం చేసుకున్నారు.

నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేపట్టారు. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ వెనుక ఉన్న ప్రధాన సూత్రధారులు, అంతర్జాతీయ లింకులపై పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. అరెస్ట్ చేసిన ఇద్దరు మహిళలను బుధవారం కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు. నగరంలో డ్రగ్స్ నిర్మూలనకు చర్యలు మరింత కఠినంగా ఉంటాయని పోలీసులు హెచ్చరించారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share