గద్దర్ సినిమా అవార్డుల వేడుకకు ఏర్పాట్లు పూర్తి

Telangana unveils Gaddar Awards memento ahead of grand ceremony on June 14 at HITEX, honoring cinematic excellence after a decade.

దశాబ్దం తర్వాత తెలంగాణ ప్రభుత్వం సినిమా అవార్డులను గద్దర్ పేరుతో ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికే గద్దర్ అవార్డుల విజేతల పేర్లను ప్రభుత్వం ప్రకటించింది. ఇప్పుడు అవార్డుల ప్రధానోత్సవానికి ఏర్పాట్లు ఊపందుకున్నాయి. ఈ నెల 14న హైటెక్స్ వేదికగా అవార్డుల వేడుక అంగరంగ వైభవంగా జరగనుంది. కార్యక్రమానికి తెలుగు సినీ రంగానికి చెందిన ప్రముఖులు, రాజకీయ నాయకులు హాజరుకానున్నారు.

ఈ నేపథ్యంలో గద్దర్ అవార్డుల జ్ఞాపికను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసింది. జ్ఞాపిక ఆకృతి ప్రత్యేకంగా ఆకట్టుకుంటోంది. ఒక చేతికి సినిమాటిక్ రీల్ చుట్టుకున్నట్లు ఉండి, పైన మరో చేతిలో డప్పును పట్టుకున్నట్లుగా డిజైన్ చేశారు. ఆ డప్పు మీద తెలంగాణ రాష్ట్ర చిహ్నాన్ని ముద్రించారు. ఇది గద్దర్ గుర్తింపుగా తీసుకున్న డప్పును ప్రాతినిధ్యం వహిస్తుంది. ఈ డిజైన్‌ను తెలంగాణ ఫిల్మ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ మరియు సినిమాటోగ్రఫీ శాఖ సంయుక్తంగా రూపొందించాయి.

అవార్డుల ప్రధానోత్సవానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ముఖ్య అతిథులుగా హాజరుకానున్నారు. ముఖ్యమంత్రి చేతుల మీదుగా అవార్డు విజేతలకు జ్ఞాపికలను అందజేయనున్నారు. తెలుగు సినిమా పరిశ్రమకు ఇది గర్వకారణంగా మారనుంది.

ఈ వేడుక కోసం హైదరాబాద్ నగరంలోని ముఖ్య ప్రదేశాల్లో హోర్డింగ్‌లు, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారు. గద్దర్ అవార్డులను ప్రతి సంవత్సరం ప్రదానం చేసేలా రాష్ట్ర ప్రభుత్వం ముందడుగు వేసినట్లు తెలుస్తోంది. ఈ అవార్డులు కొత్త టాలెంట్‌ను గుర్తించడంలో కీలకంగా మారే అవకాశం ఉంది. సినిమారంగ అభివృద్ధికి ఇది మరో మైలురాయిగా నిలుస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share

Facebook
Twitter 
WhatsApp
Telegram
Email  

Share