జర్నలిస్టులకు కొత్త అక్రెడిటేషన్స్ జారీ కోసం ప్రభుత్వం తీసుకువచ్చిన జీ.ఓ నెంబర్ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆస్కాని మారుతి సాగర్ విమర్శించారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశంలో యూనియన్ కోశాధికారి పి.యోగనంద్, టెంజు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.రమణ కుమార్, ఐజేయు జాతీయ కార్యవర్గ సభ్యులు అవ్వారి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.
జీ.ఓ 252 జర్నలిస్టుల కనీస హక్కులు, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉండటమే కాకుండా రిపోర్టర్లు–డెస్క్ జర్నలిస్టుల మధ్య విభేదాలు సృష్టించే విధంగా ఉందని ఆస్కాని మారుతి సాగర్ అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడే సమయంలో 2014లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరిగిన జర్నలిస్టుల జాతరలో అప్పటి కాబోయే సీఎం కేసీఆర్ అందరికీ అక్రెడిటేషన్ కార్డులు ఇస్తామని ప్రకటించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
ఆ ప్రకటన మేరకు అప్పటి మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 23 వేల మందికి అక్రెడిటేషన్ కార్డులు జారీ చేశారని తెలిపారు. డెస్క్ జర్నలిస్టులను కూడా గుర్తించి ఒకే గొడుగు కిందికి తీసుకురావడాన్ని అప్పట్లో కొందరు సంఘాలు వ్యతిరేకించాయని, ఇప్పుడు అదే వర్గాలు తమ పంతం నెగ్గించుకున్నాయని ఆరోపించారు. అక్రిడిటేషన్ కార్డు, మీడియా కార్డు అంటూ రెండు రకాల కార్డులు తీసుకురావడం గందరగోళానికి దారితీస్తోందని, ఏ కార్డు వల్ల ఏ ప్రయోజనం ఉంటుందో జీవోలో స్పష్టత లేదన్నారు.
కొత్త నిబంధనల కారణంగా 10 వేలకుపైగా అక్రెడిటేషన్ కార్డులు కోల్పోయే పరిస్థితి ఏర్పడిందని, ఇది జర్నలిస్టులపై అన్యాయమని టీయూడబ్ల్యూజే నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేబుల్ ఛానళ్లకు రాష్ట్ర, జిల్లా స్థాయిలో కార్డులు ఇచ్చారని, ప్రస్తుత జీవోలో వాటిని పూర్తిగా తొలగించడం వెనుక మర్మం ఏమిటని ప్రశ్నించారు. అలాగే మండల, నియోజకవర్గ స్థాయిలో కార్డులు తగ్గించడం వల్ల పార్ట్‌టైమ్ రిపోర్టర్లు తీవ్రంగా నష్టపోతారని అన్నారు.
ఇండిపెండెంట్ జర్నలిస్టుల అనుభవాన్ని 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాలకు పెంచడం అన్యాయమని టెంజు నేతలు పేర్కొన్నారు. ఐజేయు నాయకుడు అవ్వారి భాస్కర్ మాట్లాడుతూ, మీడియా అక్రెడిటేషన్ కమిటీలో ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సభ్యులను చేర్చడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ప్రస్తుతం పీసీఐకి సభ్యులే లేని పరిస్థితిలో ఈ నిబంధన అమలు అసాధ్యమని అన్నారు.









